సూర్యాపేట, ఆగస్టు 18 : కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారం ఇవ్వకుండా ఎగ్గొట్టేందుకే పేదింటి ఆడబిడ్డకు వరంగా మారిన కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, మాజీ జడ్పీటీసీ జీడి భిక్షం అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ మంగళవారం స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి సాయం చేసే గొప్ప పథకాన్ని, నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెడితే నేడు ఆ పథకాన్ని ఎత్తి వేయడం దారుణమన్నారు.
ప్రభుత్వం మహిళలకు ఇస్తామన్న తులం బంగారం, నెలకు రూ.2500, స్కూటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల రద్దకు కాంగ్రెస్ నాయకులే కోర్టులో కేసు వేశారన్నారు. ఈ విషయమై హైకోర్టు నాలుగు వాయిదాలు ఇచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదన్నారు. తమపై ఉన్న కేసుల విషయంలో పేరొందిన న్యాయవాదులకు రూ.కోట్లు ఇచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, కోట్లాది మంది మహిళలకు ఉపయోగపడే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం విషయంలో కౌంటర్ కూడా దాఖలు చేయలేదని వారు ధ్వజమెత్తారు.
కోర్టులో సరైన వాదనలు వినిపించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని, లేని పక్షంలో పర్యటనల పేరుతో వచ్చే ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలను మహిళలతో కలసి అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంగిరేకుల నాగార్జున, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సవరాల సత్యనారాయణ, బూర బాలసైదులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కౌన్సిలర్లు పోతురాజు ఇందుశ్రీ, తాహేర్, బత్తుల రమేశ్, గండూరి కృపాకర్, బండారు రాజా, ఎస్కే సల్మా మస్తాన్, సైదులు, ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, సయ్యద్, కోడి సైదులు, బొమ్మగాని శ్రీనివాస్, బత్తుల జాని, చనగాని అంజమ్మ, ఢిల్లీ పావని, కరుణశ్రీ, తాహేర్ పాషా, కొండపల్లి సాగర్‌రెడ్డి, మద్ది శ్రీనివాస్, దేశగాని శ్రీనివాస్, ఎస్కే రఫీ, రేణుబాబుతో పాటు పెద్దఎత్తున బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.