బాన్సువాడ, ఆగస్టు 18: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని నిలదీయాలని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ శ్రేణులు, మహిళలకు పిలుపునిచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల పలుచోట్ల మాట్లాడుతూ కేసీఆర్ అన్నం పెట్టిండని చెబుతున్నారని, కానీ ఇప్పుడు కేసీఆర్ ఆయనకు పెట్టేది సున్నమే అని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో బాజిరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, పార్టీ సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న, నియోజకవర్గంలోని వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అన్నివర్గాలకు సముచిత న్యాయం చేసిందని తెలిపారు. అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..రైతులు, మహిళలు, యువత, పేదలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిది డ్రామా కంపెనీ అని, ఆయనను ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి తిరిగి రానివ్వబోమని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ కోట్ల రూపాయల నిధులు ఇస్తే, ఆయనను మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలన నచ్చి, మెచ్చి కాంగ్రెస్‌లో చేరినట్లు చెప్పడానికి సిగ్గుండాలన్నారు. రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కి, ఆయనకు సరెండర్ అయి డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని పేర్కొన్నారు. పోచారం చాలా మందిని మోసం చేసి బతుకుతున్నారని ఘాటుగా విమర్శించారు.
రేవంత్‌ను సొంతపార్టీ ఎమ్మెల్యేలే కొట్టే పరిస్థితి రావచ్చు..
ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని ప్రజలే కాదని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆయనను కొట్టే పరిస్థితి వస్తుందని బాజిరెడ్డి అన్నారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిలు చేసిన కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల పాలుకాకుండా ఉండాలనే సదుద్దేశంతో కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతుబీమా, 24 గంటల నిరంతర విద్యుత్తు, దళితబంధు తదితర పథకాలు అమలుచేసి అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి రైతుబీమాకు ప్రీమియం కట్టలేదని, విద్యుత్ ఇచ్చే పది గంటల్లో నాలుగు గంటలే సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు వరి పండించవద్దని చెప్పిన దుర్మార్గుడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని దళారులకు అప్పజెప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర అందించిందని గుర్తుచేశారు. రేవంత్ సర్కారు రైతులు వరి పండిస్తే వారికి యూరియా, ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని, బోనస్ చెల్లించాల్సి ఉంటుందని ఆలోచించి, యాప్ పేరిట తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపించారు. సీఎం ఎక్కడికి వెళ్లినా కేసీఆర్, కేటీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేయడమే తప్ప, ప్రజలకు ఆయన చేసిందేమీలేదన్నారు. బాన్సువాడ ప్రాంతంలో వరి బాగా పండిస్తారని, కొనుగోలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూ చించారు. అబద్ధపు హామీలు ఇచ్చిన నాయకు లు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదని బాజిరెడ్డి హెచ్చరించారు.
కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలి.. ఆగన్న, సభ్యత్వ నమోదు బాన్సువాడ నియోజక వర్గ ఇన్చార్జి
కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లోకి వస్తే ఇచ్చిన హామీలపై నిలదీయాలని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న పిలుపునిచ్చారు. పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెండ్లి చేయడానికి ఆర్థిక భారం పడకుండా ఉండడానికి కేసీఆర్ దూరదృష్టితో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఇలాంటి గొప్ప పథకాన్ని రేవంత్ సర్కారు నీరు గార్చేందుకు కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ బాన్సువాడకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి, పోచారం శ్రీనివాసరెడ్డిని లక్ష్మీ పుత్రుడని పేరుపెట్టారని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రపు పుత్రుడిగా మారాడని ప్రజలు అంటున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు బాన్సువాడ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వాలో తెలుసన్నారు.