మద్దూర్, అక్టోబర్ 2 : సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినులు పస్తులతో అలమటించారు. శుక్రవారం ఉదయం విద్యార్థినులు బ్రేక్ ఫాస్ట్ కోసం ఎదురుచూడగా.. తమకు రెండునెలల నుంచి వేతనాలు చెల్లించడంలేదని.. వేతనాలు వచ్చేవరకు వండేదిలేదని సిబ్బంది భీష్మించారు. దీంతో ప్రిన్సిపాల్ అనీల అప్పటికప్పుడు అరటిపండ్లు తెప్పించి విద్యార్థినులకు అందజేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు సంగీతశివకుమార్, దినేశ్, నర్సింహులు పాఠశాలకు చేరుకొని విద్యార్థినులు, సిబ్బందితో మాట్లాడారు.
విద్యార్థినులు ఆకలితో ఉన్నారని వారి కోసమైనా వంటచేసి పెట్టాలని వంటసిబ్బందికి నచ్చ చెప్పడంతో వారు వంట చేయగా కౌన్సిలర్లు విద్యార్ధ్థినులకు వడ్డించారు. ఈ సమయంలో పెరుగులో ఈగ ఉండడాన్ని గమనించిన కౌన్సిలర్లు ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. సీఎం రేవంత్ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం ఇలాకాలోనే పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు. వేతనాల విషయమై ప్రిన్సిపాల్‌ను వివరణ కోసం యత్నించగా ఆమె స్పందించకపోవడం గమనార్హం.