దేవాదాయ శాఖలో అతనొక్కడే!
దేవాదాయ శాఖకు మంత్రి లేరు.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమె స్థానంలో మరెవరికీ దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ శాఖను తన వద్ద పెట్టుకున్నారు.
- అన్ని విషయాల్లో అంతా తానే అయిన ఆ శాఖ సలహాదారు
- ఆలయాల నిర్మాణ పనుల్లో ఆయనది మితిమీరిన జోక్యం
- శాఖా స్థపతులకూ దక్కని అవకాశం
- వేదపండితుల పోస్టింగుల్లోనూ తన సన్నిహితుడితో లావాదేవీలు
- దేవాదాయశాఖలో సలహాదారు వ్యవహార శైలిపై విమర్శల వెల్లువ
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖకు మంత్రి లేరు.. కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత ఆమె స్థానంలో మరెవరికీ దేవాదాయ శాఖ బాధ్యతలు అప్పగించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ శాఖను తన వద్ద పెట్టుకున్నారు. శాఖకు సంబంధించిన చిన్నచిన్న ఫైళ్లను తన వద్దకు తీసుకొనిరావద్దని, పెద్ద పైళ్లు మాత్రమే తాను చూస్తానని సీఎం చెప్పడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. దీంతో ఆ సలహాదారు గతం కంటే ఎక్కువగా మొత్తం శాఖలో అంతా తానే అయి వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి దేవాలయాల పునరుద్ధరణకు సంబంధించిన వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని దేవాదాయ ఉద్యోగులు చెప్తున్నారు.
రెండురోజుల క్రితం ఉత్తర తెలంగాణలోని ఒక ఆలయ పునరుద్ధరణ పనుల సమీక్షా సమావేశంలో ఆయనే మంత్రి అన్నట్టుగా వ్యవహరించారని, దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో వారిని మాట్లాడనీయకుండా తానే నిర్మాణదారులకు సూచనలు చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సలహాదారు చేయవలసిన పనులేంది? ఆయన చేస్తున్నదేందనే చర్చ ఆ శాఖలో పెద్దఎత్తున నడుస్తున్నది. గతంలో ఎప్పుడూ ఈ పోస్టు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఈయన కోసం ప్రత్యేకంగా పోస్టు సృష్టించి దేవాదాయ శాఖపై పెత్తనానికి అవకాశం కల్పించారని ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
పోస్టింగుల్లో భారీ లావాదేవీలు
దేవాలయాల్లో ఇటీవల చేపట్టిన పోస్టింగుల్లో భారీ స్థాయిలో లావాదేవీలు జరిగి లక్షల రూపాయలకు పోస్టులు అమ్ముకున్నారనే ఆరోపణలొచ్చాయి. అందులో ప్రధానంగా సలహాదారు తనకు సంబంధించిన ఓ తమిళనాడు ప్రాంతానికి చెంది హైదరాబాద్‌లో వేదపాఠశాల నిర్వహిస్తున్న వ్యక్తికి పరీక్షాధికారిగా అవకాశమిచ్చి అతని కనుసన్నల్లో మొత్తం పోస్టింగులు జరిగేలా వ్యవహరించారనే చర్చ అప్పట్లో నడిచింది.
చాలా దేవాలయాల్లో వేదపండితుల పోస్టులను రూ.20 లక్షలకు బేరం పెట్టారని, ఈ విషయంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు బాధ్యులెవరో తెలిసినా, సాక్ష్యాలు తమ వద్ద ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉన్నారంటే అందుకు కారణం ఈ సలహాదారేనని ఆలయవర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల బ్రాహ్మణ పరిషత్ నుంచి వేద పాఠశాలలకు నిధులు విడుదల చేసిన సందర్భంలోనూ సదరు వేద పాఠశాల నిర్వాహకుడికి రూ.పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలకుపైగా నిధులు ఇచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలో నిర్వహిస్తున్న వేద పాఠశాలలకు మాత్రం కేవలం వేల రూపాయల్లోనే సహకారం అందించారని వేద పాఠశాలల నిర్వాహకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్థపతుల్ని కాదని.. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై!
కంచి, శృంగేరీ పీఠాలకు ఈ సలహాదారు దేవాదాయ శాఖ ఖర్చుతోనే నెలలో ఐదారుసార్లు వెళ్తూ, అక్కడి వారితో సంప్రదింపులు జరుపడం, మరీ ముఖ్యంగా కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్‌లను వెంటబెట్టుకొని వెళ్లి చర్చిస్తున్నారట. దేవాలయాల నిర్మాణంలో కీలక పాత్ర దేవాదాయ శాఖ స్థపతులది కాగా, వారికి సంబంధం లేకుండా వారి ప్రమేయమే లేకుండా అంతా తానే అయి, కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మొత్తం ఆలయాల పునర్నిర్మాణాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ బొగ్గులకుంటలోని ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాసర, కాళేశ్వరం, వేములవాడ, జోగుళాంబ, భద్రాచలం, యాదాద్రి వేద పాఠశాల వంటి చోట్ల ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటి విషయంలో స్థపతులు తమ అనుభవంతో ఆలయ వైభవానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం దెబ్బతినకుండా ఆయా దేవాలయాల ఆగమాల ప్రకారం మార్పులు చేర్పులు, నిర్మాణ రీతులు తదితర అంశాలను కాంట్రాక్టర్లతో చర్చించాలి. కానీ, అటువంటి పరిస్థితి ఆయా దేవాలయాల నిర్మాణాల వద్ద కానీ, దేవాదాయ శాఖ వద్ద కానీ లేదు. నామమాత్రంగా కొన్నిచోట్లకు స్థపతిని తీసుకెళ్తున్నారే తప్ప, ఆయన నుంచి ఎలాంటి సలహాలూ తీసుకోవడం లేదు.
చాలాచోట్ల దేవాదాయ శాఖకు ప్రత్యేక ఇంజినీర్లు ఉన్నప్పటికీ వారిని కూడా ఈ పనుల్లో జోక్యం చేసుకోనీయడం లేదని దేవాదాయ ఉద్యోగులు చెప్పారు. ఈ సలహాదారుపై గతంలో అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా తిరిగి వేల కోట్ల రూపాయల పనులపై ఆయన పెత్తనం ఉండటం వెనుక ఆంతర్యమేందని ధార్మికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కొన్ని మఠాలు, పీఠాలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో, కొన్ని ప్రజా సంబంధిత కార్యక్రమాల్లో ఈ సలహాదారు జోక్యంతో పెద్దఎత్తున కుంభకోణాలు జరిగాయని, ఒక దశలో ఒక పీఠానికి చెందిన పెద్ద వ్యక్తి కూడా పోలీసు కేసులో చిక్కుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని, అటువంటి వ్యక్తికి తిరిగి తెలంగాణలో ఆలయాల పునరుద్ధరణ పనులు ఎలా అప్పగిస్తారని గతంలో ఆయనతో పనిచేసిన వారు ప్రశ్నిస్తున్నారు. ఈ సలహాదారు కేవలం నిర్మాణాలు, బంగారు పనులపైనే దృష్టి కేంద్రీకరించి కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకుంటారని, తెలంగాణలో కొత్తగా వేదపండితుల పోస్టింగుల్లో చేయిపెట్టడానికి ఆ శాఖలో పనిచేస్తున్న ఒక కీలక అధికారి కారణమని వారు చెప్పారు.
వేములవాడ ప్రాభవాన్ని దెబ్బతీసేలా నిర్మాణాలు
దేవాలయాలపై పెత్తనమే కాకుండా పోస్టింగుల విషయంలో ప్యాట్నీ సెంటర్లోని ఒక ఆంజనేయస్వామి దేవాలయ అర్చకుడితో సాన్నిహిత్యం ఏర్పరుచుకొని తన వాటాతోపాటు దేవాదాయ శాఖలో ఒక కీలక అధికారికి, మరికొందరి వాటాలను ఈ సలహాదారే నిర్ణయించారట. మరోవైపు కాంట్రాక్టర్లతో మాట్లాడి ఒక్కోచోట ఒక్కోలా పని చేయిస్తున్నారని, వేములవాడలో స్థానిక కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తూ ఆలయ ప్రాభవాన్ని దెబ్బతీసేలా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉంటే బాసర, భద్రాచలం వంటి చోట్ల ఆయా ఆగమాల ప్రకారం జరుగాల్సి ఉండగా అవన్నీ తుంగలో తొక్కి తన ఇష్టారాజ్యంగా నిర్మాణ పనులు చేయిస్తున్నారని, తనకు సంబంధించి తన ప్రాంతం వాడైన ఆర్కిటెక్‌తో డిజైన్లు వేయించి తనకు నచ్చిన కాంట్రాక్టర్లతో పనులు చేయిస్తున్నారనే చర్చ జరుగుతున్నది. ఆలయాల నిర్మాణ రీతులు, వాటికి సంబంధించిన వ్యవహారాలు పర్యవేక్షించాల్సిన స్థపతులు డమ్మీగా మారడానికి కారణమైన ఈ సలహాదారు విషయంలో దేవాదాయ శాఖను తన వద్దనే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి అతనిని సమర్థిస్తారా? లేక అతని వ్యవహారశైలి, కార్యకలాపాలపై నిఘా వర్గాల నుంచి నివేదిక తెప్పించుకొని చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

