పెంట్లవెల్లి, మార్చి 28: రుణమాఫీ చేయాలంటూ మండుటెండల్లో రైతులు నిరసన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు పెంట్లవెల్లి సొసైటీలో రుణమాఫీ చేయలేదని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ముందు శుక్రవారం నిరసన చేపట్టారు. అంతకు ముందు సింగిల్ విండో చైర్మన్ విజయ రామారావు అధ్యక్షతన సొసైటీ కార్యాలయంలో మహాజనసభ కార్యక్రమాని నిర్వహిస్తుండగా సభను రైతులు అడ్డుకొని పెబ్బేర్- కొల్లాపూర్ వెళ్లే ప్రధాన రహదారిపై మండుటెండలో సుమారు గంటన్నర పాటు రోడ్డుపై బైఠాయించారు.
సీఎం ఢాం ఢాం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..త్వరలో రుణమాఫీ అవుతుందనే నమ్మకంతో ఇతరుల వద్ద డబ్బులు వడ్డీకి తీసుకున్నామని తెలిపారు. సొసైటీలో రుణమాఫీ కాకపోవడంతో ఇతరుల వద్ద తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టలేక ఇబ్బందుల పాలవుతున్నామని వాపోయారు. రాజకీయ కక్ష సాధింపుతోనే ఈ ప్రభుత్వం పెంట్లవెల్లి సొసైటీలో 499 మంది రైతులు తీసుకున్న పంట రుణాలు మూడు విడతలుగా ఒక్క రైతు కూడా నాయ పైస కూడా రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సొసైటీ చైర్మన్ విజయ రామారావు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పోతుల వెంకటేశ్వర్లు, రాజేష్ ,సురేందర్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పి కొందరికి మాత్రమే రైతు రుణమాఫీ చేసి సంబురాలు చేసుకోవడంపై మండిపడ్డారు. ఆరు నెలల క్రితం హైదరాబాద్లోని సొసైటీ కమిషనర్ ఉదయ్ కుమార్ను కలిసి తమ సొసైటీలో ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదని వినతి పత్రం ఇచ్చామన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెంట్లవెల్లి సొసైటీలో రైతులు తీసుకున్న రుణాలను బేషరతుగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రైతుల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.