తిమ్మాజీపేట,మే 28 : ప్రభుత్వం నిర్ధేశించిన ఇళ్ల నమూనా మేరకు లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం తిమ్మాజీపేట మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పక్కగా అమలు చేయాలని, జూన్ రెండో తేదీ నాటికి ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంటిని ప్రారంభించుకునేలా పనులు పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు.
ఇందిరమ్మ ఇండ్లకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉండేలా చూడాలని, ఇసుకను ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గృహ నిర్మాణ యాప్లో పొందుపరి చే విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సంబంధితశాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం అదే గ్రామంలో నిర్మిస్తున్న నూతన అంగన్వాడీ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. పనులు నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట హౌసింగ్ పీడీ సంగప్ప, తాసిల్దార్ రామకృష్ణయ్య, ఎంపీడీవో లక్ష్మీదేవి, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.