Telangana Culture | టాలీవుడ్ అగ్ర నటుడు విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహం తర్వాత, విజయ్ తన సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, తుమ్మనపేటలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వ్రతం ముగిసిన తర్వాత అతిథులకు, గ్రామస్థులకు నాన్-వెజ్ (మాంసాహారం) వడ్డించడంపై నెటిజన్ల మధ్య పెద్ద చర్చ నడుస్తోంది. అయితే దీనిపై గట్టిగా బదులిస్తున్నారు తెలంగాణ నెటిజన్లు.
చర్చకు దారితీసిన అంశం ఏమిటంటే?
సాధారణంగా హిందూ సంప్రదాయాల ప్రకారం సత్యనారాయణ వ్రతం వంటి పవిత్ర పూజలు జరిగినప్పుడు కేవలం శాఖాహారం (వెజ్) మాత్రమే వడ్డిస్తారు. కానీ విజయ్ దేవరకొండ తన ఇంటి దగ్గర నిర్వహించిన ఈ వేడుకలో వెజ్ మరియు నాన్-వెజ్ రెండింటినీ వడ్డించారు. దీంతో “పూజ ఉన్న రోజు మాంసాహారం పెట్టడం ఏమిటి? ఇది సంప్రదాయ విరుద్ధం” అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విమర్శలపై తెలంగాణ నెటిజన్లు గట్టిగా బదులిస్తున్నారు. హిందూ ధర్మంలో సంస్కృతి అనేది ప్రాంతాన్ని బట్టి మారుతుందని, తెలంగాణలో ఇది మరింత భిన్నంగా ఉంటుందని వారు వివరిస్తున్నారు. ఇక్కడ భక్తితో పాటు ఆహారం పట్ల కూడా ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. పూజ ముగిసి, స్వామివారి పీఠాన్ని జరిపిన తర్వాత మాంసాహార విందు చేసుకోవడం తెలంగాణలోని చాలా కుటుంబాల్లో ఆనవాయితీగా వస్తోందని నెటిజన్లు పేర్కొంటున్నారు. దేవుడికి పెట్టే నైవేద్యం మరియు ప్రసాదం ఖచ్చితంగా శాఖాహారమే ఉంటుందని అయితే, పూజ ముగిసిన తర్వాత అతిథులకు పెట్టే భోజనంలో మాంసం వడ్డించడం అనేది ఆయా కుటుంబాల ఆచారం మరియు ప్రాంతీయ సంస్కృతిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. తెలంగాణలోని చాలా గ్రామాల్లో దేవుడి పూజ పూర్తయ్యాక, సాయంత్రం లేదా మరుసటి రోజు విందులో మాంసం వడ్డించడం సర్వసాధారణమని చెబుతున్నారు.
మరోవైపు విజయ్ దేవరకొండ తన మూలాలను మర్చిపోకుండా, తన ఊరి జనాన్ని తన సంతోషంలో భాగం చేస్తూ, వారు కోరుకున్న విందును అందించడం గొప్ప విషయమని ఆయన అభిమానులతో పాటు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “సంప్రదాయాలు మనుషుల కోసం పుట్టాయి.. ప్రాంతాన్ని బట్టి వాటిని గౌరవించడం నేర్చుకోవాలి” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఊరందరికీ వివాహభోజనం పెట్టిన #VijayDeverakonda
సొంత ఊర్లో సత్యనారాయణ వ్రతం చేసిన అనంతరం బంధుమిత్రులనదరికీ గ్రామస్తులకు విందు భోజనం పెట్టిన విజయ్ దేవరకొండ..#Virosh ❤️ pic.twitter.com/tojnbgBJcj
— Suresh PRO (@SureshPRO_) March 2, 2026