Jamulamma Temple | గద్వాల, జనవరి 27 : జమ్మిచ్చెడులో 18 శక్తిపీఠాల నమూనా ప్రతిష్టించడానికి దాతలు విరాళంగా ఇచ్చిన సొమ్ము ఏమైంది..?
ఒక్కో పీఠానికి రూ. 2.50 లక్షల చొప్పున దాతల నుంచి విరాళాలు సేకరించి చాలా కాలమైంది. కానీ నేటికీ పనులు పూర్తి కాలేదు. జోగులాంబ గద్వాల జిల్లా జమ్మిచ్చెడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం జములమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న 18 శక్తిపీఠాల నిధుల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అమ్మవారిపై భక్తితో, పవిత్ర ఆశయంతో దాతలు వెచ్చించిన లక్షలాది రూపాయలు వృధా అయ్యాయా..? అసలు ఆ నిధులు ఎటు వెళ్లాయి..? అనే ప్రశ్నలు భక్తుల నుంచి ఎదురవుతున్నాయి. కొన్నేళ్ల క్రితం జమ్మిచ్చెడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేశంలోని 18 మహాశక్తి పీఠాల నమూనా విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించాలని నిర్ణయించారు.
ఈ పవిత్ర కార్యానికి ముందుకు వచ్చిన ఒక్కో దాత నుంచి సుమారు రూ. 2,50,000 వరకు విరాళంగా సేకరించినట్లు సమాచారం. 18 పీఠాలకుగానూ భారీ మొత్తంలో నిధులు సమకూరినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం దాతల ఆకాంక్షలకు అనుగుణంగా జరగలేదన్న విమర్శలు ఉన్నాయి.
సరైన లెక్కలు చూపడం లేదని..
శక్తిపీఠాల నిర్మాణం పూర్తై, భక్తులకు దర్శనభాగ్యం కలుగుతుందని ఆశించిన దాతలకు ఇప్పుడు నిరాశే మిగులుతోంది. సేకరించిన నిధులకు, జరిగిన పనులకు పొంతన లేదని ఆరోపణలు వస్తున్నాయి. దాతలు ఇచ్చిన డబ్బులకు సరైన లెక్కలు చూపడం లేదని, ఆలయ అధికారులు గానీ, కమిటీ సభ్యులుగానీ దీనిపై స్పష్టత ఇవ్వడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాల ప్రతిష్టాపన, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఫలితంగా దాతల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, తక్షణమే ఆడిటింగ్ నిర్వహించి దాతల సొమ్ముకు లెక్క చెప్పాలని స్థానికులు, అమ్మవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిధుల మళ్లింపుపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గద్వాల జిల్లా ప్రజలు కోరుతున్నారు.