Gadwal | నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని గద్వాల డీఎస్పీ మొగులయ్య తెలిపారు. ఫేక్ సర్టిఫికెట్లతో నరేశ్ కుమార్ అనే వ్యక్తి 2017లో గద్వాల జిల్లా మల్దకల్ వ్యవసాయ శాఖలో ఉద్యోగం పొందాడనే వ్యవహారం ఇటీవల బయటకు పొక్కింది. గద్వాల జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నరేశ్‌కుమార్ తరహాలోనే పెరుమాల నాగరాజు కూడా ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మధ్యవర్తి బాలకృష్ణ ద్వారా అతను ఈ ఉద్యోగం పొందినట్లు తెలిసింది. దీంతో ఏఈవో నరేశ్‌కుమార్, నాగరాజులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మొగులయ్య ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. నిందితులు ఒక్కొక్క ధ్రువపత్రానికి రూ.90వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చు చేశారని తెలిపారు. యూపీలోని పలు యూనివర్సిటీల నుంచి వీళ్లు అగ్రికల్చర్ డిప్లొమో చేసినట్లుగా నిర్ధారించామన్నారు. వీరికి ఉద్యోగం ఇప్పించిన మధ్యవర్తి బాలకృష్ణ పరారీలో ఉండటంతో పూర్తి సమాచారం బయటకు రాలేదని తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని, పరిదాపూర్, హాజీపూర్ యూనివర్సిటీ అండి యూనివర్సిటీ, నుండి అగ్రికల్చర్ డిప్లమా పట్టాలు పొందినట్లు నిర్ధారణకు రావడం జరిగిందని విచారణ అనంతరం పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని గద్వాల డిఎస్పి మొగిలయ్య అన్నారు.