MP DK Aruna | బీఆర్ఎస్ వాళ్లు ఓటు అడిగే హక్కు లేదని ఎంపీ డీకే అరుణ అనడం హాస్యాస్పదంగా ఉందని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్ అన్నారు. ఆంజనేయ గౌడ్ గద్వాల బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాస్ హనుమంతు నాయక్‌తో కలిసి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ.. మామ సత్యారెడ్డి నుండి అల్లుడు కృష్ణమోహన్ రెడ్డి వరకు గద్వాల ప్రజలను అణిచివేసే ధోరణిలో గద్వాలలో పాలించారు తప్పా అభివృద్ధి చేసిందేమి లేదన్నారు. మీ కుటుంబం పాపాల చిట్టా విప్పితే రామాయణం, మహాభారతం కూడా తక్కువే అంటూ ధ్వజమెత్తారు. గతంలో కేశవ్‌ను మున్సిపల్ చైర్మన్ చేశారు కానీ కమిషనర్‌కు ఫోన్ చేసి చైర్మన్ పని వినకు అని చెప్పింది ఇదే బంగ్లావాళ్ళు కాదా అని ఆంజనేయ గౌడ్ ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకత్వంలోమున్సిపాలిటీలో రూ.12 కోట్లు పెట్టి వీధి లైట్లు, ఇండోర్ స్టేడియం, డయాలసిస్ సెంటర్ తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగిందని అన్నారు. డీకే అరుణ శవాలను ఖననం చేయడానికి (స్మశానం) స్థలం ఇవ్వలేదని.. బీఆర్ఎస్ హయాంలో ఖననం చేయడానికి రెండు వైకుంఠధామాలను ఏర్పాటు చేశామన్నారు. ఇంత అభివృద్ధి చేసినా జాతీయ నాయకురాలు జూటా కూతలు కూయడం కరెక్ట్ కాదని ఆంజనేయ గౌడ్ హితవు పలికారు.
తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి..
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొండల్ రెడ్డి అయితే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ పార్టీ, ఈ పార్టీలో చేరుతూ జెండాలు మార్చుకుంటూ జెండల్ రెడ్డి అయ్యాడంటూ ఆంజనేయ గౌడ్ గద్వాల ఎమ్మెల్యేను విమర్శించారు. తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి అని.. గద్వాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్లో ఉంటే మున్సిపల్ ఎన్నికల్లో మా పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు. అత్త అల్లుడు ప్రజలను ఇంకా ఎంతకాలం మోసం చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్పై అడ్డగోలు అబద్ధాలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని ఎంపీ డీకే అరుణను ఉద్దేశించి హెచ్చరించారు. బంగ్లా భవిష్యత్తు కోసం డీకే అరుణ ఆరాటపడుతున్నారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం ఆరాటపడడం లేదని విమర్శించారు. అనంతరం గద్వాల పట్టణానికి చెందిన సుమారు 200 మంది బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీలను వీడి ఆంజనేయులు గౌడ్, హనుమంతు నాయుడు, కేశవ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
