సిటీబ్యూరో: అధిక లాభాలొస్తాయంటూ నమ్మించి ఓ ప్రైవేట్ ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు రూ. 41 లక్షలు టోకరా వేశారు. సరూర్‌నగర్‌కు చెందిన బాధితుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ చేస్తున్నాడు. బాధితుడి ఫోన్ నంబర్‌ను స్టాక్ మార్కెట్ థింక్ ట్యాంక్-4 అనే పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌నకు యాడ్ చేశారు. గ్రూప్ అడ్మిన్‌గా ఉన్న రక్షిత వేద్ ఫోన్ చేసి.. తాము స్టాక్ ట్రేడింగ్‌కు సంబంధించిన మెళకువలు చెబుతామని సూచించింది. తమ కస్టమర్ కేర్‌కు చెందిన ఎఫ్ఐఎస్డీ పీఆర్ఓ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
యాప్ డౌన్లోడ్ చేసుకోగానే అకౌంట్ క్రియేట్ చేసి.. రూ. 10 వేలు పెట్టుబడి పెట్టడంతో రూ. 414 లాభం వచ్చింది. ఒకే రోజులో షేర్స్ కొని అమ్మడంతో లాభం రావడంతో బాధితుడు నిజమని నమ్మాడు. ఆ తరువాత సైబర్‌నేరగాళ్లు చెప్పినట్లు వివిధ కంపెనీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాడు. యాప్‌లో స్క్రీన్‌పై కోట్ల రూపాయలు కనిపించాయి. రూ. 41,62,000 పెట్టుబడి పూర్తయిన తరువాత స్క్రీన్‌పై రూ. 3.76 కోట్లు కనిపించాయి. దీంతో ఆ డబ్బు విత్ డ్రా చేసుకోవాలంటే 20 శాతం కమీషన్ చెల్లించాలంటూ సైబర్‌నేరగాళ్లు షరతు విధించడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితుడు.. మల్కాజిగిరి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.