స్టేషన్‌ఘన్‌పూర్, మార్చి11 : పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ధ్వజమెత్తారు. బుధవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీ-పీసీసీ ఇన్చార్జి దీపాదాస్మున్షీ సమక్షలో కాంగ్రెస్ కండు వా కప్పుకున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి లోక్‌సభ ఎన్నికల్లో తన కూతురు కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేస్తే గెలుపుకోసం ప్రచారం చేశారని గుర్తు చేశారు.
దీనిపై అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఆధారాలు చూపినా కడియం శ్రీహరికి క్లీన్‌చీట్ ఇచ్చి రాజ్యాంగాన్ని అవమానపర్చడంతోపాటు తూట్లు పొడిచారని రాజయ్య మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌రెడ్డి స్క్రిప్టుగా అభివర్ణించారు. దీనిని రాహుల్ గాంధీ బలపర్చగా స్పీకర్ చదివాడని రాజయ్య ఎద్దేవా చేశారు. స్పీకర్ తీర్పు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని, దీనిని ప్రజలు, మేధావులు, ఊహించేదనన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని పాతరేసిందని, ఇది అసెంబ్లీ చరిత్రలో బ్లాక్ డే అని రాజయ్య అన్నారు.
కేసీఆర్ భిక్షతో పదవులు అనుభవించిన కడియం
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భిక్షతో ఎంపీగా, ఉప ముఖ్యమంత్రిగా పదవులు అనుభవించిన కడియం శ్రీహరి నేడు బీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తాటికొండ రాజయ్య విమర్శించారు. కేసీఆర్‌కు దండాలు పెట్టి, పొగిడిన ఆయనే నేడు క్షమాపణ చెప్పాలని కోరడం శ్రీహరి అవివేకానికి నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీ మారిన వారిని చట్టబద్ధంగా విలీనం చేసుకున్నారు తప్ప ఎవరి ఇంటికీ వెళ్లి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించలేదని రాజయ్య వివరించారు. టీ-పీసీసీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ స్వయంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందేన్నారు.
ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల సభలో కాంగ్రెస్ పార్టీలో చేరానని కడియం శ్రీహరి చెప్పారని తెలిపారు. ఒకసారి కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తున్నానని, మరోసారి తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ చెప్పాలని కడియం మాట్లాడారని ఆయన గుర్తు చేశారు. శ్రీహరికి నైతిక విలువలుంటే బీఆర్ఎస్ కండువా కప్పుకుని స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో అడుగు పెట్టాలని రాజయ్య సవాల్ విసిరారు. అలా వస్తే వెయ్యి కండువాలతో తాము స్వాగతం పలుకుతామని, కాంగ్రెస్ కండువాతో వస్తే చీపురుకట్టలతో బుద్ది చెబుతామని రాజయ్య స్పష్టం చేశారు. చట్టసభ నుంచి తప్పించుకున్న కడియం శ్రీహరికి రాజ్యాంగంపై నమ్మకం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం, చట్టసభలు, కోర్టులపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాలు ఎంతోకాలం కొనసాగవన్నారు.