– పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు, రైతులు
– నాయకుల అరెస్టు, పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
ఎర్రుపాలెం, ఆగస్టు 10 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన జైల్‌భరో కార్యక్రమం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో సోమవారం ఉద్రిక్తంగా సాగింది. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన ఆందోళనలో భాగంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కేంద్రంలోని రింగ్ సెంటర్ వద్ద గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు, ఉపాధిహామీ కూలీలు, రైతులు సీఐటీయూ ఆధ్వర్యంలో ఏకమయ్యారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. జైల్‌భరో కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని పలువురు నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకుల అరెస్టును నిరసిస్తూ వివిధ సంఘాల కార్మికులు రింగ్ సెంటర్ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ బైఠాయించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. గతంలో రైతాంగ ఉద్యమాలు, ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద జరిగిన యువత ఉద్యమాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు అంశాల్లో వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జైల్‌భరో కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. శ్రామిక వర్గాన్ని ఇబ్బందులకు గురిచేసే లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఉపాధిహామీ చట్టాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతోపాటు వ్యవసాయ కూలీలు, ఇతర రంగాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ పోరాటం ఒక్కరోజుతో ముగిసేది కాదని, ఇది భవిష్యత్ ఉద్యమాలకు నాంది మాత్రమేనని హెచ్చరించారు. గ్రామపంచాయతీ, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ కో-కన్వీనర్ దూదిగం బసవయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు కన్నెబోయిన శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు గామాసు జోగయ్య, నాగులవంచ వెంకట రామయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల మండల అధ్యక్ష, కార్యదర్శులు గంతాల నాగేశ్వరరావు, నరేంద్ర, అంగన్వాడీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మినేని మాధవి, కృష్ణకుమారి, ఆశా కార్యకర్తల మండల అధ్యక్ష, కార్యదర్శులు నండ్రు సుధారాణి, ఏసుమణితో పాటు షేక్ లాలా, ఆంగోతు వెంకటేశ్వర్లు, కూడల్లి నాగేశ్వరరావు, చిత్తరు కిషోర్, బేతు శ్రీను, శీలం వెంకటేశ్వరరావు, దివ్వెల వీరాంజనేయులు, పొట్టేటి వెంకటనారాయణరెడ్డి, నక్క పుల్లారావు పాల్గొన్నారు.