– సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు
కోదాడ, సెప్టెంబర్ 29 : ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేపడుతున్న వారోత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో మంగళవారం క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య, కోదాడ యూనిట్ అధ్యక్షుడు వేనేపల్లి శ్రీనివాసరావు, వయోవృద్ధుల కోదాడ డివిజన్ అధ్యక్షుడు గడ్డం నరసయ్యతో కలిసి ఆయన క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధుల్లో ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో తోడ్పడతాయన్నారు.
వృద్ధాప్యంలోనూ మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం ఆటలు ఎంతో అవసరమని, వారోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపొందిన విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, ఆర్థిక కార్యదర్శి తమ్మనబోయిన వీరబాబు, రాష్ట్ర కౌన్సిలర్ పొట్ట జగన్మోహన్ రావు,ఉపాధ్యక్షులు భ్రమరాంబ, గులాం యాస్థాని, బాలేమియా, విద్యాసాగర్ రావు, విశ్రాంత ఉద్యోగులు, వయోవృద్ధులు పాల్గొన్నారు.