– సమాచారం అందలేదంటున్న క్రీడాకారులు
– 28 మందితోనే జిల్లా స్థాయి ఎంపికలపై అనుమానాలు
నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 29 : నల్లగొండ జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌పై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్రీడాకారులకు ముందస్తు సమాచారం విస్తృతంగా అందకుండా ఎంపికలు నిర్వహించారంటూ పలువురు క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. నల్లగొండలోని మేకల అభినవ్ స్టేడియంలో ఎస్జీఎఫ్ సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ నిర్వహించినట్లు సమాచారం. అయితే సెలక్షన్స్‌కు సంబంధించిన సమాచారం అధికారిక ఎస్జీఎఫ్ వాట్సాప్ గ్రూపుల్లోనూ విస్తృతంగా ఇవ్వలేదని పలువురు క్రీడాకారులు పేర్కొంటున్నారు.
గత ఏడాది నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ సెలక్షన్స్‌కు సుమారు 300 మంది క్రీడాకారులు హాజరైనప్పటికీ, ఈ ఏడాది కేవలం 8 మంది బాలికలు, 20 మంది బాలురు మాత్రమే పాల్గొన్నారని క్రీడాకారులు చెబుతున్నారు. ఇంత తక్కువ సంఖ్యలో క్రీడాకారులతో జిల్లా జట్టు ఎంపిక చేయడం వెనుక కారణమేంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సెలక్షన్స్ సమాచారం అందరికీ చేరకుండా పరిమితం చేశారన్న ఆరోపణలతో పాటు, ఎంపిక ప్రక్రియపై కూడా కొందరు క్రీడాకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు తీసుకుని ఎంపికలు చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, వాటికి స్వతంత్రంగా ధృవీకరణ లభించాల్సి ఉంది. ఈ ఆరోపణలను సంబంధిత ఎస్జీఎఫ్ అధికారులు స్పష్టీకరించాల్సి ఉంది.
క్రీడాకారులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన సెలక్షన్స్ ప్రక్రియపై పూర్తి వివరాలను అధికారులు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు సెలక్షన్స్ నిర్వహణ, హాజరైన క్రీడాకారుల సంఖ్య, ఎంపికైన జాబితా, సెలక్షన్ విధానం తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ స్పందించి సెలక్షన్స్‌పై సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు. అధికారిక రికార్డులు, ఎంపిక ప్రక్రియ, హాజరు వివరాలు పరిశీలిస్తే ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది స్పష్టమయ్యే అవకాశం ఉంది.