అర్వపల్లి, ఆగస్టు 10 : “రైతులతో మాట – పంట మార్పిడికి బాట” కార్యక్రమాన్ని సోమవారం అర్వపల్లి మండలం వెల్పుచర్ల, లోయపల్లి గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇప్పటివరకు ఎలాంటి పంట సాగు చేయని రైతులను కలిసి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటల ఎంపికపై విస్తృతంగా చర్చించారు. రైతులు సాగు చేయకుండా ఉన్న భూములను పరిశీలించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అనువైన పంటలను సాగు చేయాలని అధికారులు సూచించారు. పంట మార్పిడి ద్వారా భూసారం పరిరక్షణతో పాటు రైతులకు మెరుగైన ఆదాయం పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, ఏఈఓ సత్యం, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, సర్పంచులు వల్లపు గంగయ్య, వెంకటమ్మ పాల్గొన్నారు.