Shivaji | టాలీవుడ్లో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శివాజీ తాజాగా ‘పుష్ప’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’లో మంగళం శ్రీను పాత్రలో సునీల్ నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రతో సునీల్ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అప్పటివరకు హీరోగా, హాస్యనటుడిగా ఎక్కువగా కనిపించిన ఆయన.. ‘పుష్ప’లో ప్రతినాయక ఛాయలున్న పాత్రలో మెప్పించారు. దేశవ్యాప్తంగా ఈ పాత్రకు మంచి గుర్తింపు రావడంతో సునీల్‌కు వరుస అవకాశాలు కూడా వచ్చాయి.అయితే ఈ పాత్ర మొదట తనకు రావాల్సిందని నటుడు శివాజీ తాజాగా వెల్లడించారు. ‘తెల్ల కాగితం’ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మంగళం శీను పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
శివాజీ మాట్లాడుతూ.. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప’ సినిమాలో మంగళం శీను పాత్రను తాను చేయాల్సి ఉందని తెలిపారు. అయితే ఆ పాత్ర సునీల్‌కు దక్కిందని చెప్పారు. ఒక పాత్ర ఎవరికి రాసి ఉంటే చివరికి వాళ్లకే వెళ్తుందని, తనకు రాసి లేని పాత్రను తాను ఎలా చేయగలనని శివాజీ వ్యాఖ్యానించారు. మంగళం శీను పాత్ర సునీల్‌కు రాసి పెట్టి ఉందని, అందుకే ఆ పాత్ర ఆయనకు వెళ్లిందని అన్నారు.సునీల్ ఆ పాత్రలో అద్భుతంగా నటించారని, ఎవరు ఏ పాత్ర చేసినా చివరకు అది వాళ్లకే సరిపోతుందని శివాజీ అభిప్రాయపడ్డారు. ‘పుష్ప’తో సునీల్ కెరీర్లో వచ్చిన మార్పును కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఇక తాను ప్రస్తుతం నటిస్తున్న ‘తెల్ల కాగితం’ సినిమా కథ కూడా మొదట తన దగ్గరకే వచ్చిందని శివాజీ తెలిపారు. కథ విన్న వెంటనే తనకు చాలా నచ్చిందని, ఈ సినిమాను తానే నిర్మించాలని కూడా అనుకున్నట్లు చెప్పారు.
సినిమాల్లోకి మళ్లీ రావాలని నిర్ణయించుకున్న సమయంలో తాను విన్న రెండో కథ ‘తెల్ల కాగితం’ అని శివాజీ వెల్లడించారు. అప్పటికే ‘కూర్మావతారం’ అనే మరో చిత్రానికి తాను కమిట్ అయ్యానని, అందులో గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపారు.ఈ క్రమంలో ఈటీవీ విన్‌కు చెందిన సాయికృష్ణ తనకు ‘తెల్ల కాగితం’ కథను పంపించారని, కథ నచ్చడంతో తాను సినిమా చేస్తానని చెప్పానని శివాజీ వివరించారు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని తానే నిర్మిస్తానని కూడా చెప్పినట్లు తెలిపారు.అయితే దర్శకుడు రమేష్ బండ్రెడ్డి ఈ కథను నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ వద్దకు తీసుకెళ్లారని శివాజీ చెప్పారు. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా ఈ కథపై ఆసక్తి చూపడంతో, అది నిర్మాత కృష్ణ కొమ్మలపాటి, దిల్ రాజు వద్దకు వెళ్లిందని తెలిపారు.ఈ కథను దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత తీసుకున్న తర్వాత తన వద్దకు తిరిగి వస్తుందని తాను అనుకోలేదని శివాజీ అన్నారు. చివరకు కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు.