KTR | పోరాడితే పోయేదేమీలేదు.. బానిస సంకెళ్లు తప్పా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూరాల ప్రాజెక్టు(Jurala project) పరిధిలో సాగు నీటి విడుదల కోసం రైతులు ఉద్యమించి విజయం సాధించిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం అన్నారు. ఈ అసమర్ద ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా చేసేలా పోరాడటమే మన మిగిలిన రెండేళ్ల కర్తవ్యం అని అన్నారు.
ఈ కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అన్నారు. ఈ రైతు పోరాటంలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు అందరికి నా కృతజ్ఞతలు తెలిపారు. ప్రశ్నించడం, పోరాడడం, మన తెలంగాణ హక్కుల కోసం అవసరం అయితే ఎవరితోనైనా కొట్లాడడం ఇదే మన ముందున్న లక్ష్యం అన్నారు. జైలంగాణ, జై కేసీఆర్.. మన హక్కుల కోసం పోరాడడమే మన ముందున్న అసలైన లక్ష్యం అని పిలుపునిచ్చారు.
కాగా, ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగం పోరాటానికి సర్కార్ తలవంచింది. కేటీఆర్ అల్టిమేటం, అన్నదాతల ఆందోళనతో ఎట్టకేలకు దిగొచ్చింది. జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నది. సమాంతర కెనాల్కూ నీటిని విడుదల చేసేందుకు సర్కార్ సంసిద్ధత వ్యక్తంచేసింది. బుధవారం లేదా గురువారం తెల్లవారుజామున నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.
పోరాడితే పోయేదేమీలేదు…
బానిస సంకెళ్లు తప్పా!!!జూరాల ప్రాజెక్టు నుండి నీరు అందక, పొలాలు పూర్తిగా ఎండిపోతున్న తరుణంలో…రైతులు, వాళ్ల హక్కుల కోసం చేసిన పోరాటం చాలా స్ఫూర్తిదాయకం!
ఈ కుంభకర్ణ ప్రభుత్వన్ని, ముల్లుగర్రతో తట్టి, పరుగులు పెట్టించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు!
— KTR (@KTRBRS) September 23, 2026