సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): జనగణన-2027ను పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరీ అన్నారు. జనాభా గణనలో ఏ ఒక్కరినీ వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలన్నారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిఫ్లెక్ట్ కావాలన్నారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియా పరిధిలోని సెన్సస్ -2027 సర్వేపై చార్జీ సెన్సస్ ఆఫీసర్లు, అదనపు చార్జీ సెన్సెస్ ఆఫీసర్ల ఫేజ్-1 హౌజ్ లిస్టింగ్, హౌజింగ్ సెన్సస్లపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాలను భారతి హోళికేరి ప్రారంభించి మాట్లాడారు.
సెన్సెస్-2027 సర్వే రెండు దశల్లో జరుగుతుందని, మొదటి దశలో ఇళ్ల జాబితా సేకరణ, గృహ గణన, రెండో దశలో జనాభా గణన ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జరుగుతున్న మొట్ట మొదటి సెన్సెస్ 2027ను విజయవంతం చేసి మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలపాలని భారతి హోళికేరి సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టనున్న జనగణన కుటుంబాల వాస్తవ స్థితిగతులను ప్రతిబింబించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకల, మాస్టర్ ట్రైనర్లు పాల్గొన్నారు.