అలంపూర్ : మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంటను రైతులు కల్లాలలో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన మిరప పంట తడిసి ముద్దయిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు మానవపాడు గ్రామానికి చేరుకుని రైతులను పరామర్శించి మిర్చి పంటను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలోని మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుని వారికి నష్టపరిహారంతో పాటుగా మిర్చి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అలంపూర్ నియోజకవర్గం రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.