Srinivas Goud | అధికారులు ఆటో డ్రైవర్లను ఇబ్బందులకు గురిచేయవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ ముందు ఆటోలు ఆపవద్దని అధికారులు చెప్పడంతో ఆందోళన చేస్తున్న ఆటో డ్రైవర్లను పోలీస్ స్టేషన్ కు తరలించిన విషయం తెలుసుకొని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడికి వెళ్లారు. సమస్య తెలుసుకొని బస్టాండ్ వద్దకు డ్రైవర్లతో కలిసి వెళ్లి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఇప్పటికే ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఆటో కార్మికులను ఆదుకుంటామని చెప్పి ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. బస్టాండ్ ముందు కొన్నేళ్లుగా ఆటో డ్రైవర్లు ప్రయాణికుల కోసం ఆటోలు అవుతున్నారని.. బస్సు లు రావడానికి, పోవడానికి ఇబ్బంది లేకుండా నిలుపుతున్నారని తెలిపారు. అధికారులు వాటిని అక్కడ ఆపడానికి అనుమతి ఇవ్వకుంటే ఆటో కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతాయని అన్నారు. పిల్ల చదువులు, కుటుంబ పోషణ, రుణాల చెల్లింపులు ఉంటాయని పేర్కొన్నారు. అధికారులు మానవతా దృక్పధంతో ఆలోచన చేయాలని కోరారు.
అధికారులు సూచించిన విధంగా బస్టాండ్ ముందు ఆటోలు కార్మికులు నిలుపుకుంటారని అనుమతి ఇవ్వాలని కోరారు. క్రమ పద్ధతిలో ఆటోలు నిలిపి ప్రయాణికులను తీసుకెళ్లాలని.. బస్సులకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని అధికారులు ఆటో డ్రైవర్లను కోరారు. దానికి ఆటో డ్రైవర్లు ఒప్పుకోవడంతో ఆటోలు నిలుపుకునేందుకు అవకాశం ఇస్తామని అధికారులు తెలిపారు.
సమస్య చెప్పిన వెంటనే వచ్చి పరిష్కారానికి చొరవ తీసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ఆటో డ్రైవర్ లు కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ మంత్రి వెంట గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.