Konaraopeta | కోనరావుపేట, జూలై 16 : వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్లోనూ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సిరిసిల్ల నుండి కోనరావుపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రెక్కలు ముక్కలు చేసుకుని రైతులం పంటలను సాగు చేసుకుంటే కళ్లముందే ఎండిపోతున్నా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో నాణ్యమైన విద్యుత్ అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం, విద్యుత్ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యలతో పాటు వ్యవసాయ మందులు, ఎరువులు కూడా మార్కెట్లో సకాలంలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు. పెట్టుబడులు రోజురోజుకూ పెరుగుతున్నా సాగుకు అవసరమైన వనరులు అందక నష్టాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. అయితే, ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి విద్యుత్ సరఫరాపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని రైతులు స్పష్టం చేశారు. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.