Iran vs US : అమెరికా, ఇరాన్ (USA, Iran) మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇరుదేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. తాజాగా ఇరాన్‌పై రెండో విడత వైమానిక దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (US Centrel Command) ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియా (West Asia) లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున ఈ దాడులు జరిపినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో వెల్లడించింది.
“హర్మూజ్ జలసంధి గుండా స్వేచ్ఛగా ప్రయాణించే నౌకలకు ముప్పుగా పరిణమించిన ఇరాన్ సైనిక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపాం” అని పేర్కొన్నది. ఈ పరిణామంతో ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా విఫలమైనట్లు స్పష్టమవుతోంది. ఈ దాడులకు ముందు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బేకర్ ఖలీబాఫ్ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. హర్మూజ్ జలసంధిలో ఇరానియన్ల ఆధిపత్యాన్ని కొనసాగించడం తమ జాతీయ భద్రతలో భాగమని ఆయన స్పష్టం చేశారు.
శత్రువులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఖలీబాఫ్ చెప్పారు. ఖలీబాఫ్ విడుదల చేసిన ప్రకటనలో అమెరికా తన స్వప్రయోజనాల కోసం ఇరాన్‌ను దెబ్బతీయడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. యుద్ధం లేదా శాంతి చర్చల సమయంలో ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలు, భద్రత, వాస్తవికత, దీర్ఘకాలిక వ్యూహం ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. “మేము యుద్ధాన్ని కోరుకోము. కానీ మా జాతీయ భద్రత, ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు దౌత్యం, చర్చలు సమాంతరంగా కొనసాగాలని ఖలీబాఫ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల జూన్ 18న ఇరాన్, అమెరికా మధ్య లెబనాన్ సహా అన్ని సరిహద్దులలో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం.. 60 రోజుల్లో తుది ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఈ ఒప్పందంపై ఖలీబాఫ్ మాట్లాడుతూ.. “ఒప్పందంలోని నిబంధనలను గౌరవించి, అమలు చేసినప్పుడే దానికి అర్థం ఉంటుంది. ఒకవేళ ఈ ఒప్పందం ద్వారా ఇరాన్‌కు ప్రయోజనం కలగనప్పుడు, దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం మాకు లేదు” అని స్పష్టంచేశారు.
అయితే గత కొన్ని రోజులుగా ఇరుదేశాల సైనిక బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఈ శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. తాజాగా అమెరికా రెండో విడత దాడులు నిర్వహించడంతో ఈ ఒప్పందం పూర్తిగా నీరుగారిపోయినట్లయింది. ఈ పరిణామాలతో హర్మూజ్ జలసంధి కేంద్రంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.