Fire Blight | దామరగిద్ద : వరి చేనులో అగ్గి తెగుళ్లతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని.. జాగ్రత్తలు తీసుకుంటే మంచి పంట దిగుబడి వస్తుందని మండల వ్యవసాయ అధికారి మణి చందర్ అన్నారు. ఇవాళ మండలంలోని బాపనపల్లి గ్రామంలో రైతుల పొలాలను పరిశీలించి నివారణ కోసం సూచనలు చేశారు.
ముందురోజు కొద్దిగా చిన్న మచ్చలుగా కనిపించే అగ్గి తెగులు మరుసటి రోజుకు మడి మొత్తం వ్యాపించి పంటను నాశనం చేస్తుందని మణి చందర్ తెలిపారు. ఈ తెగులు రావడంతో పంటంతా ఎండిపోయి ఒట్టి గడ్డి మాదిరిగా కనిపిస్తోంది. వరి పంటపై ఏ దశలోనైనా ఇది ఆశించవచ్చు. వరి ఆకుల మీద, వెన్ను మెడ భాగాల మీద, ఆకులపై నూలుకండె ఆకారం కలిగిన గోధుమ రంగు అంచులు గల మచ్చలు ఏర్పడతాయన్నారు.
మచ్చల మధ్యలో బూడిద రంగు ఉంటుంది. పిలకల కణుపుల వద్ద ఆశిస్తే ఆ ప్రదేశం వద్ద పిలక విరిగి వాలి పోతుంది. తెగులు సోకిన వెన్ను మెడ దగ్గర నల్లటి మచ్చలు ఏర్పడి వెన్ను విరిగి వేలాడుతూ కనిపిస్తుంది. తెగులు సోకిన మొక్కల్లో ఎక్కువ తాలుగింజలు ఏర్పడతాయి. ఈ తెగులు ఉధృతి ఖరీఫ్ కన్నా రబీలో ఎక్కువగా ఉండి పంటకు తీవ్రనష్టాన్ని కలిగిస్తుందన్నారు.
అగ్గి తెగులు నివారణకు విత్తనశుద్ధికి 1 కిలో విత్తనానికి 3 గ్రా. కార్బెండిజమ్ మందును కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగులు తట్టుకునే వంటి రకాలను రకాలను సాగుచేయాలి. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడిన పొలాల్లో అగ్గి తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
సిఫారసు చేసిన నత్రజనిని 3-4 సార్లు వేయాలి. తెగులు సోకిన పొలంలో 5 శాతం ఆకులు నష్టపోయినచో ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా/లీ. లేదా కాసుగామైన్ 2.5 మి.లీ./లీ. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5 మి.లీ./లీ* . నీటిలో కలిపి పిచికారి చేయాలి. సకాలంలో జాగ్రత్తలు చేపడితే ఈ తెగులు నుండి పంటను రక్షించుకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
Singer Kalpana | వెంటిలేటర్‌పై చికిత్స.. కల్పన హెల్త్ బులెటిన్ విడుదల
Crazy Star Award | రెబ్బెనకు చెందిన దేవర వినోద్‌కు క్రేజీ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
Inter student | పోలీసుల ఔదార్యం.. ఇంటర్ విద్యార్థిని సకాలంలో పరీక్ష కేంద్రానికి తరలింపు