హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ) : 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది. ఓపెన్ మారెట్ బారోయింగ్స్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వేల కోట్ల రుణాలు సేకరించినట్టు కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ గొల్ల బాబూరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో రూ.69,300 కోట్లు, ఏపీ సర్కార్ రూ.56,072 కోట్ల అప్పు సేకరించించినట్టు గణాంకాలు వెల్లడించారు. 2025-26లో తెలంగాణ ప్రభుత్వం మొదటి మూడు నెలల్లో రూ.17,400 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.32,500 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.19,400 కోట్లు.. ఇలా తొమ్మిది నెలల్లో రూ.69,300 కోట్ల అప్పులు చేసినట్టు వెల్లడించారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి మూడు నెలల్లో రూ.26,572 కోట్లు, రెండో క్వార్టర్లో రూ.17,600 కోట్లు, మూడో త్రైమాసికంలో రూ.11,900 కోట్లు.. ఇలా తొమ్మిది నెలల్లో రూ.56,072 కోట్ల రుణ సమీకణ చేసినట్టు వివరించారు. కేంద్రం విడుదల చేసిన డాటా ప్రకారం బీజేపీ పాలిత మహారాష్ట్ర రూ.99,000 కోట్ల రుణ సమీకరణతో దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణాదిలో అత్యధికంగా అప్పు లు చేసిన రాష్ట్రంగా తమిళనాడు రూ.95, 300 కోట్లతో నిలిచింది. ఆ తర్వాత ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటక రూ.12, 000 కోట్లు, కేరళ రూ.36,338 కోట్లు రుణ సమీకరణ చేశాయి. ఓపెన్ మారెట్ రుణాల ద్వారా ఈ నిధులను రాష్ట్రాలు సేకరించినట్టు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. అయితే, రాష్ట్రాలు చేస్తున్న ఈ అప్పుల్లో ప్రధాన భాగం పాత అప్పుల చెల్లింపుల కోసమే మళ్లిస్తున్నట్టు తన సమాధానంలో పేరొనడం గమనార్హం.
