పరిగి, మార్చి 10 : ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను లాక్కొంటుందనే ఆందోళనతో మండలంలోని కాళ్లాపూర్ రైతులు భయం గుప్పిట్లో విలవిలలాడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములు సర్కారు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఉన్న పొలాలు పొతే తాము రోడ్డునపడతామని.. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంటున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ప్రభుత్వం మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో 1,197 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించి.. భూసేకరణకు నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. అందుకోసం కాళ్లాపూర్ పరిధిలో 428.05 ఎకరాలు అసైన్డ్ , 159.25 ఎకరాల పట్టా భూములు, రాపోల్లో అసైన్డ్ భూములు 509 ఎకరాలు, 101.08 ఎకరాల పట్టా భూములను సేకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రైతులు గత పక్షం రోజులుగా తమకు తెలిసిన నాయకుడు, అధికారులు, కలెక్టర్‌ను కలిసి తమ భూములు లాక్కోవద్దని మొరపెట్టుకుంటున్నారు. తమ భూములను సర్కారు గుంజుకుంటుందనే సమాచారంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కాళ్లాపూర్ గ్రామంలో ఏ నలుగురు ఒక చోట చేరినా తమ భూములు పోతాయంట, ఎట్ల బతకాలనే చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిన్న తిండి పెయ్యికి పట్టడం లేదని, కంటికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని, ఈ వయసులో ఎక్కడికి పోయి బతుకుతామని బాధపడుతున్నారు. సర్కారు తమకు డబ్బులు ఇస్తే ఏమి చేసుకుంటాం.. భూమి ఉంటే ఏదో ఓ పంట వేసి బతుకుతామని పేర్కొంటున్నారు.
వేరుపడిన కుటుంబాలు 50 నుంచి 60 మంది వరకు ఉండగా వారి భూ ములన్నీ ఇండస్ట్రియల్ పార్కు కోసం చేపడుతున్న భూసేకరణలో పోతుండడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు. మార్పు వస్తుందనుకొని ఆశపడి, తమ పిల్లలకు కొలువులు వస్తాయని కాంగ్రెస్‌ను గెలిపిస్తే తమ నోటికాడి బుక్కను లాక్కుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ బాధలు ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కల్పించుకొని తమ భూములను సర్కారు తీసుకోకుండా చూడాలని కోరుతున్నారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చే ప్రసక్తే లేదని వారు తేల్చి చెబుతున్నారు.
మా మామయ్య భీమయ్య కష్టపడి 11 ఎకరాల భూమిని సంపాదించాడు. రూ. కోటికి ఎకరం అడిగినా మేము అమ్మలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్కు పేరిట మా భూమిని లాక్కుంటామంటే వదిలేదేలేదు. మా పిల్లలను చదివించాలన్నా మాకు ఆ భూమే ఆధారం. బావి ఉండడంతో ప్రతి ఏటా రెండుమూడు పంటలను పండిస్తూ జీవిస్తున్నాం. మా జీవనాధారమంతా ఆ భూమిపైనే ఉన్నది. ఆ భూమి పోతే తల్లిపిల్లలం అందరం మందు తాగి చనిపోతాం. ఎలాంటి కంపెనీలు మాకు అవసరం లేదు. మా భూముల్లోకి ఎవరు రావద్దు.. ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలూ మాకు వద్దు.
– సోమగారి విజయలక్ష్మి, కాళ్లాపూర్
ప్రాణాలు పోయినా భూమి ఇచ్చేది లేదు. మా కుటుంబానికి చెం దిన 20 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం సేకరించే భూసేకరణలో పోతున్నది. మాకు ఫ్యాక్టరీలు, పరిశ్రమ లు వద్దు. గత 20 రోజులుగా ఇంట్లోని వారు తినకుండా తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మా ఊరి నుంచి మంచి మెజారిటీతో ఎమ్మెల్యేను గెలిపించాం. మా భూములు పోకుండా ఆయన చూడాలి. మా భూములను హోల్డ్‌లో ఎందుకు పెట్టారు? ఇప్పుడు భూములు పోతే మా బతుకులు ఎట్ల. మా భూములు హోల్డ్‌లో నుంచి తీయించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే. అడిగేందుకెళ్తే బెదిరిస్తున్నారు. మా భూములను లాక్కుంటే ఎక్కడికి పోయి బతకాలి. మీకు కనికరం లేదా..? మీకు పిల్లలు లేరా..? మా బాధ ఎందుకు పట్టించుకోవడం లేదు. మేము ఓట్టేస్తే గెలిచి ఇప్పుడు మోసం చేస్తారా..? పిల్లలకు కొలువులు ఇస్తామని చెప్పి సీఎం, ఎమ్మెల్యే మమ్మల్ని ఆగం పట్టించారు.
-పరిగి వెంకటమ్మ, కాళ్లాపూర్, పరిగి
ఉన్న రెండెకరాల భూమి ఇండస్ట్రియల్ పార్కు కోసం పోతే మేము ఎలా బతకాలి. మా పిల్లల భవిష్యత్తు ఏమిటి..? తాతల కాలం నుంచి వచ్చిన భూమిని సాగు చేసుకుంటూ బతుకుతున్నాం. ఆ భూమిని కూడా సర్కార్ బలవంతంగా తీసుకోవాలని చూడడం దారు ణం. 20 రోజుల నుంచి తిన్న తిండి పెయ్యికి పట్టడం లేదు. రాత్రి నిద్ర పట్టడం లేదు. రోజం తా ఇదే ఆలోచనతో ఉన్నాం. సర్కారు ఇలా మా భూములు లాక్కోవాలని చూడడం మంచిది కాదు. భూమి పోతే ఎక్కడికెళ్లాలి.. ఏమి చేసుకొని బతకాలి..?
– సోమగారి దస్తయ్య, కాళ్లాపూర్
రేవంత్‌రెడ్డి సర్కార్ పేదల పాలిట రాక్షస ప్రభుత్వంగా మారింది. ఇండస్ట్రియల్ పార్కు పేరిట మా 5 ఎకరాల భూమి పోతున్నది. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీరులను ఆదర్శంగా తీసుకొని మా భూములను కాపాడుకునేందుకు పోరాడతాం. మా భూముల జోలికి వస్తే ఖబడ్దార్. రేవంత్‌రెడ్డి ప్రజల కోసం సీఎం అయ్యిండు తప్ప ఆయన కోసం కాదు. మా పట్టా భూమిలో రూ. పది లక్షలు పెట్టి బావి తవ్వించగా నీరు బాగున్నాయి. ఆ నీటితోనే పంటలు సాగు చేస్తున్నా. మాకు ఎలాంటి ఉపాధి అవకాశాల్లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం మా భూములు లాక్కొనే ఆలోచనను విరమించుకోవాలి.
-చాకలి మల్లేశం, కాళ్లాపూర్, పరిగి
నాకు మూడెకరాల భూమి ఉండగా ఆరుగురు కొడుకులున్నారు. భూమినే నమ్ముకుని జీవి స్తున్నాం. మా కుటుంబ సభ్యులందరిది కలిపి ఇండస్ట్రియల్ పార్కు పేరిట సుమారు 50 ఎకరాల వరకు భూమి పోతున్నది. తాతల కాలం నాటి నుంచి వచ్చిన ఈ భూములను నమ్ముకొని, పంటలు సాగు చేసుకుని జీవిస్తున్నాం. అకస్మాత్తుగా ఫ్యాక్టరీల పేరుతో భూములను సర్కారు తీసుకుంటే మా బతుకులు ఏమి కావాలి..? ఎన్ని డబ్బులిచ్చినా ఏమి చేసుకుంటాం. వృద్ధాప్యంలో ఎక్కడికి వెళ్లి, ఏ పని చేసుకొని బతకాలి. సర్కారు మా భూముల జోలికి రావద్దు.
-గిరిగంటి అంజయ్య, కాళ్లాపూర్, పరిగి