Hanuman | బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతోంది. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ లంకాధీశుడు రావణాసురుడిగా నటిస్తున్నారు. దాదాపు నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఒక ప్రధానమైన విషయంపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సన్నీ డియోల్ హనుమంతుని పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే, విడుదలైన ట్రైలర్లో శ్రీరాముడి బాల్యం, సీతారాముల కల్యాణం, వనవాసం, రావణుడి ఆధిపత్యం వంటి అనేక సన్నివేశాలను చూపించినప్పటికీ, హనుమంతుడికి సంబంధించిన ఒక్క చిన్న గ్లింప్స్ కూడా ట్రైలర్లో కనిపించలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తూ ట్రైలర్లో హనుమంతుడు ఎక్కడ? అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మొదటి భాగంలో కథ ఎక్కువగా సీతారాముల వివాహం, వనవాసం, సీతాపహరణం చుట్టూ తిరుగుతుందని, అందుకే హనుమంతుడి పాత్రకు సంబంధించిన హైలైట్స్ను మేకర్స్ గోప్యంగా ఉంచారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అభిమానులు మాత్రం హనుమంతుడి పోస్టర్ను అయిన వదలండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఏది ఏమైనప్పటికీ, హనుమంతుడి పాత్రపై ఉన్న భారీ అంచనాల కారణంగా ఆయన గ్లింప్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.