Sumanth | అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘న్యూటన్స్ థర్డ్ లా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (HPS)లో కలిసి చదువుకున్న రోజుల జ్ఞాపకాలను పంచుకుంటూ, జగన్‌లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపించేవని చెప్పారు. తాను మరియు వైఎస్ జగన్ ఒకే పాఠశాలలో చదువుకున్నామని, ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేదని తెలిపారు. స్కూల్లో జరిగిన అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనేవాళ్లమని, తరచూ సినిమాలకు, రెస్టారెంట్లకు కూడా కలిసి వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
జగన్ నాకు రెండేళ్లు సీనియర్. అయినప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. స్కూల్ రోజుల్లో మా బాండింగ్ చాలా బలంగా ఉండేది. తర్వాత జీవితంలో ఇద్దరం వేర్వేరు రంగాలను ఎంచుకోవడంతో కలుసుకునే అవకాశాలు తగ్గిపోయాయి అని సుమంత్ చెప్పారు. ఆయనలో చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు కనిపించేవని సుమంత్ వెల్లడించారు. జగన్ మా స్కూల్ హౌస్ కెప్టెన్‌గా ఉండేవారు. ఆయనలో అప్పటి నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేవి. చాలా ప్రశాంతంగా, అదే సమయంలో ధైర్యంగా వ్యవహరించేవారు. పెద్దయ్యాక రాజకీయాల్లోకి వెళ్తాడని అప్పుడే అందరికీ అనిపించేది. అలాగే నేను సినిమా రంగంలోకి వస్తానని కూడా మా స్నేహితులు చెప్పేవారు. చివరకు ఇద్దరం అనుకున్న దారుల్లోనే ప్రయాణించాం అని అన్నారు.
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని కూడా సుమంత్ స్పష్టం చేశారు.రాజకీయాలు చాలా బాధ్యతతో కూడిన రంగం. అందులో రాణించాలంటే సహజంగానే ఆ రంగంపై ఆసక్తి, అంకితభావం ఉండాలి. నాకు అలాంటి ఆసక్తి లేదు. రాజకీయాల్లో చాలా మంది స్నేహితులు ఉన్నారు. వారిని గౌరవిస్తాను. కానీ నేను మాత్రం ఆ రంగానికి సరిపోను అని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనను కలిసే అవకాశం రాలేదని సుమంత్ చెప్పారు. అయితే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒకసారి కలిసినట్లు వెల్లడించారు. స్కూల్ పూర్తయిన తర్వాత ఇద్దరి కెరీర్లు వేర్వేరు దారుల్లో సాగడంతో పరస్పరం కలవడం చాలా తగ్గిపోయాయని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి సినీ రంగంలోకి తన మామ అక్కినేని నాగార్జున వచ్చారని, ఆ తర్వాత తాను సినిమా రంగంలోకి వచ్చానని తెలిపారు. నటుడు రానా దగ్గుబాటి తనకు జూనియర్ అని, దర్శకుడు నాగ్ అశ్విన్‌తో పాటు మరెందరో హెచ్‌పీఎస్ విద్యార్థులు సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు.