ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వసతులు మెరుగుపడడంతో విద్యార్థులు క్యూ కడుతున్నారు. విశాలమైన తరగతి గదులు, ఆటస్థలంతో పాటు ఉచితంగా పుస్తకాలు కూడా అందిస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు. చదువుతోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండ డంతో సర్కార్ కళాశాలల వైపు మొగ్గు చూపుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర, బాలికల జూనియర్ కళాశాలలో ఇప్పటికే 2వేలకు పైగా అడ్మిషన్లు రావడం ఇందుకు నిదర్శనం. అక్కడ ఏ ఒక్కరిని కదిలించినా చదువు, వసతులు చాలా బాగున్నాయని అంటున్నారు.
మహబూబ్‌నగర్, జూలై 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లకు ఫుల్ డిమాండ్ ఉన్నది. ప్రైవేట్ కాలేజీల్లో లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక చాలా మంది ప్రభుత్వ కళాశాలల బాట పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలల్లో వసతులను మెరుగుపర్చడం, ఉచితంగా పుస్తకాలు ఇస్తుండడంతో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో పాస్ పర్సెంటేజీ కూడా పెరిగింది. ప్రభుత్వ కళాశాలల్లో చదివిన చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యలో రాటుదేలుతున్నారు. స్పోర్ట్స్ కోటాలో కూడా చాలా మంది ప్రతిభ కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 65 జూనియర్ కళాశాలలున్నాయి. ప్రతి కళాశాలలో అన్ని గ్రూపులకు కలిపి దాదాపుగా 500 మందికి అడ్మిషన్స్ ఇవ్వొచ్చు. కానీ, స్థానికంగా కళాశాలల్లో చేరేందుకు డిమాండ్ ఉండడంతో కొన్నిచోట్ల 1500 వరకు అడ్మిషన్లు ఇస్తున్నారు. దీంతో ఇప్పటికే దాదాపుగా 80 శాతం మేర అడ్మిషన్లు పూర్తయ్యాయి. మరికొన్ని కాలేజీల్లో సీట్లు లేవని వెనక్కి పంపిస్తున్నారు. తాజాగా కస్తూర్భా, గురుకులాలను ఇంటర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశారు. అక్కడ కూడా అడ్మిషన్ల కోసం విద్యార్థులు క్యూ కడుతున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల కళాశాలల్లో చేరేందుకు విద్యార్థిని, విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు బాలికల కళాశాలల్లో పరిమితికి మించి అడ్మిషన్లు అవుతున్నాయి. ఒక్కో కాలేజీలో 500 నుంచి 800 వరకు చేరాల్సి ఉండగా.. ఇప్పటికే అడ్మిషన్ల సంఖ్య వెయ్యి దాటింది. దీంతో క్లాస్రూంలు నిండిపోతున్నాయి. అదనపు గదులను వినియోగిస్తున్నారు. ల్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. రెగ్యులర్ కోర్సులతోపాటు కొత్తగా వచ్చిన కోర్సుల్లో కూడా అడ్మిషన్లు అవుతున్నట్లు ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. ప్రభుత్వ కళాశాలన్నింటిలో విశాలమైన ప్రాంగణాలు ఉన్నాయి. వాలీబాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, రన్నింగ్, లాంగ్ జంప్, హైజంప్లతోపాటు వివిధ ఆటలను ఆడుతున్నారు. దీంతో విద్యార్థులకు ఫిజికల్‌గా ఫిట్ అవుతున్నారు. చాలా మంది అంతర్జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటుతున్నారు. ఎన్సీసీ, క్రీడలకు ప్రత్యేక అవకాశాలు ఇవ్వడంతో చాలామంది విద్యార్థులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు.
అన్ని కోర్సుల్లో సీట్లు ఫుల్..
ప్రభుత్వ బాలికల కళాశాలల్లో చేరేందుకు విద్యార్థినులు క్యూ కడుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థినుల్లో చాలా మందికి 900 మార్కులపైన వచ్చాయి. ఎంపీసీ, బైపైసీ, సీఈసీ, హెచ్ఈసీ.. ఇలా అన్ని కోర్సుల్లో అడ్మిష న్లు నిండిపోయాయి. అయినా సరే విద్యార్థినుల తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఉద్దేశంతో చేర్చుకుంటున్నాం. సీట్లు ఫుల్ అయిన కో ర్సుల్లో చేరేందుకు వచ్చిన విద్యార్థినులకు కౌన్సెలింగ్ ఇచ్చి వేరే కోర్సుల్లో జాయిన్ చేస్తున్నాం. విద్యార్థినులు ఎక్కువ కావడంతో గదులు సరిపోవడం లేదు. షీ టీంల తో నిఘా ఏర్పాటు చేశాం. కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తున్నాం.
– కౌసర్ జహాన్, ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, మహబూబ్‌నగర్
ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి..
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ప్రజాప్రతినిధులు, ఇతరులు సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వం కళాశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించింది. కొన్ని కళాశాలల్లో సీట్లు ఫుల్ అయ్యాయి. చాలా కాలేజీల్లో 80 శాతం అడ్మిషన్లు అయ్యాయి. మరికొన్ని చోట్ల సీట్ల సంఖ్యకు రెట్టింపుగా అడ్మిషన్లు వచ్చాయి.
– నర్సింహారెడ్డి, జూనియర్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, మహబూబ్‌నగర్
ప్రైవేట్‌కు వెళ్దామనుకున్నా..
నేను ఫస్ట్ ప్రైవేట్ కాలేజీల్లో చేరుదామనుకున్నా. మా అమ్మానాన్న ఈ కళాశాల గురించి చాలా చెబుతుండేవారు. ఇక్కడ చదివిన వారు చాలా పెద్ద స్థాయిలో ఉన్నారని చెప్పారు. వసతులతోపాటు, ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది. నేనూ ఇదే కాలేజీలో చదివి ప్రిన్సిపాల్, లెక్చరర్‌గా అయినా ఇక్కడికే వచ్చి సేవలందించాలని నా కోరిక. అదే లక్ష్యంతో ఇక్కడ చేరాను.
– సింధూ, బాలికల జూనియర్ కళాశాల, మహబూబ్‌నగర్
ఇంజినీర్ అవుతా..
ఇంజినీర్ కావాలన్నదే నా కోరిక. అందుకోసం పట్టుదలతో చదువుతా. పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. ప్రభుత్వం పేద పిల్లలకు పుస్తకాలు, స్కాలర్షిప్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. మహబూబ్‌నగర్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో చేరాను. చదువుతోపాటు ఆటలు, ఇతరాత్రా యాక్టివిటీస్ నేర్చుకునే అవకాశం ఉంటుంది.
– పృథ్వీ, గణేశ్‌నగర్, మహబూబ్‌నగర్