వేములవాడ, నవంబర్ 27: ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవ్వడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గురువారం వేములవాడ తహసీల్ ఆఫీస్ ఎదుట మంజూరు పత్రాలతో నిరసన తెలిపారు. 13, 14వ వార్డుల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ పనుల కోసం ఇసుక అనుమతి ఇవ్వకుండా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వేధిస్తున్నారని ఆరోపించారు.
మూడు నెలులుగా తిరుగుతున్నా స్పందించడం లేదని వాపోయారు. డబ్బులు ఇస్తేనే ఇసుక ఇంటికి చేరుతున్నదని, తమపై ఆర్థిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూలి పనులు చేసుకొని బతికే తాము ఎక్కడి నుంచి డబ్బులు తేవాలని వాపోయారు. తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు స్పందించి.. ఇసుక అందిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.