హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమం రాజకీయపరమైందే తప్ప, మరే ఇతర కారణాలు లేవని, ఉమ్మడి రాష్ట్రంలో నీటి కేటాయింపుల అంశంలో తెలంగాణపై ఎన్నడూ వివక్ష చూపలేదంటూ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదనలు వినిపించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టిన విచారణ ఢిల్లీలో గురువారం కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర ఎదుట ఏపీ తరఫున సీనియర్ అడ్వకేట్ జయదీప్‌గుప్తా వాదనలు వినిపించారు. ఏపీలో హైదరాబాద్ స్టేట్ విలీనమైనప్పటి నుంచి తెలంగాణ ఏర్పడే దాకా తెలంగాణ నుంచే నలుగురు ముఖ్యమంత్రులుగా పనిచేశారని తెలిపింది.
ఇరు రాష్ర్టాల అభివృద్ధి కోసమే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014ను తీసుకొచ్చారని, అందులో ఏపీకి మాత్రమే స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలని పేరొన్నారని, తెలంగాణకు కాదని వాదించింది. హైదరాబాద్ మహానగరం ఉండటం, అది ధనిక రాష్ట్రం కావడంతో తెలంగాణకు స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వలేదని వివరించింది. తెలంగాణకు జరిగిన వివక్షను కేవలం కృష్ణా బేసిన్ అనే చిన్నకోణంలో చూడొద్దని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పరిశీలించి ఆ ప్రాంతానికి అన్యాయం ఎకడ జరిగిందో చెప్పాలని పేర్కొన్నది.
ఉమ్మడి ఏపీలో పాలకులంతా హైదరాబాద్‌లోనే అభివృద్ధి చేశారని, పెట్టుబడులన్నీ అక్కడికే వెళ్లాయని వివరించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టనంత మాత్రాన తెలంగాణపై వివక్ష చూపినట్టా? అంటూ ఎదురుదాడికి దిగింది. కృష్ణా నీళ్లను తెలంగాణ వాడుకోవడమేగాక, గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కూ తరలిస్తున్నదని వాదించింది. తెలంగాణకు అన్యాయం చేశామనే వాదన పూర్తి అసంబద్ధమని, దానిని అంగీకరించబోమని పేర్కొన్నది.
ఔట్‌సైడ్ బేసిన్‌కు నీటిని తరలించుకుపోతున్నామనే తెలంగాణ వాదన సరికాదని, బచావత్ ట్రిబ్యునల్‌కు తెలంగాణ నీటి అవసరాలు వివరించలేదనడం సత్యదూరమని ఏపీ ఖండించింది. తెలంగాణకు 173 టీఎంసీల అవసరం ఉన్నదని వివరించామని, కానీ అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టంలోని సెక్షన్ 4(1) కింద అది చెల్లదని నాడు ట్రిబ్యునల్ తిరసరించిందని గుర్తుచేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 17వ తేదీకి ట్రిబ్యునల్ వాయిదా వేసింది. తెలంగాణ తరఫున సీఎస్ వైద్యనాథన్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులు విచారణకు హాజరయ్యారు.