హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఇలాంటి తుగ్లక్ పాలన తాను మొదటి సారి చూస్తున్నానని, కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం కల అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఎద్దేవా చేశారు. మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అంటూ ఉద్యమ సారథి కేసీఆర్ నవంబర్ 29, 2009లో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టించిందని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ పేదండ్లలో కేసీఆర్ నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చేసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని తెలిపారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలును మరిచి ప్రజలను మోసం చేసిందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి, సర్పంచ్ ఎన్నికల్లో కేవలం 17 శాతం స్థానాలు మాత్రమే కేటాయించి తీవ్రంగా మోసం చేసిన కాంగ్రెస్ పై తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి దగా చేశారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను కాంగ్రెస్ నిలువునా ముంచిందన్నారు. పరిశ్రమల భూముల కన్వర్షన్ వల్ల రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.
29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తాం..
29న తెలంగాణ భవన్లో ‘దీక్షా దివస్’ ను పండుగ వాతావరణంలో ఘనంగా జరపనున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దీక్షా దివస్ పోస్టర్‌ను ఆవిషరించారు. దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను వివరించే ప్రత్యేక వీడియో ప్రదర్శించనున్నమని తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని నియోజకవర్గ ఇన్చార్జిలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ దీక్షను కాంగ్రెస్, టీడీపీ అడ్డుకుంది: ఎర్రోళ్ల శ్రీనివాస్
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్‌ను ఆనాటి సీఎం వైఎస్సార్, చంద్రబాబు కలిసి పోలీసుల సహాయంతో అడ్డుకున్నారు అని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఉద్యమం నేపథ్యంలో ఎంతో మంది విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని స్మరించుకున్నారు. కేసీఆర్ చేసిన ఉద్యమం వల్ల తెలంగాణ సాధన జరిగిన తీరు తెన్నుల గురించి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో 2001 నుంచి పద్నాలుగేళ్ల పాటు జరిగిన ఉద్యమం వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు. దీక్షాదివస్ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, గజ్జెల నగేశ్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత కిశోర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.