మహబూబ్‌నగర్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామపంచాయతీ ఎన్నికల సమరంలో తొలివిడుత నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభమైంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో తొలి విడుత జీపీలు, వార్డు సభ్యులకు పెద్ద సంఖ్య లో నామినేషన్లను దాఖలు చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సర్పంచులకు 68, వార్డులకు 13, వనపర్తి జిల్లాలో సర్పంచులకు 75, వార్డులకు 26, నారాయణపేట జిల్లాలో సర్పంచులకు 69, వార్డులకు 38, నాగర్‌కర్నూల్ జిల్లాలో సర్పంచులకు 121 నామినేషన్లు, వార్డులకు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యు ల పదవులకు భారీ ఎత్తున పోటీ పడుతున్నారు. గద్వాల జిల్లాలో ఏకంగా సర్పంచ్ పదవికి వేలం వేసి రూ.57 లక్షలకు దక్కించుకున్న వైనం చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా మరో రెండు సర్పంచ్ స్థానాలను గ్రామస్తులంతా ఏకమై ఏకగ్రీవం చేసుకున్నారు. నామినేషన్ల ప్రక్రియను అన్ని జిల్లాల్లో ఎన్నికల సంఘం ప్రత్యేక ప్రతినిధులు సందర్శించారు.
ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా నామినేషన్ల ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లను చేశారు. దాదాపు రెండేళ్ల నిరీక్షణ తర్వాత సర్పంచ్ పదవులకు ఎన్నికలు రావడంతో చాలా మంది పో టీకి సై అంటున్నారు. తొలి విడుత నామినేషన్ల ఘ ట్టానికి మరో రెండ్రోజుల సమయం ఉండడంతో మండల కేంద్రాలు, గ్రామాల్లో జోరుగా చర్చలు సాగిస్తున్నారు. పోటీకి ఎవరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు. కాగా మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో అన్ని పార్టీలకు సర్పంచ్ పదవులకు క్యాండిడేట్లను ఎంపిక చేయడం తలకు మించి న భారంగా మారింది. పోటీకి చాలా మంది ఉత్సా హం చూపుతుండడంతో క్యాండిడేట్లను ఖరారు చేయలేక పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికలను గ్రామస్థాయి నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలు ఎట్టకేలకు జరుగుతుండడంతో ఈసారి రిజర్వేషన్లకు అనుకూలంగా పోటీకి దిగుతున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో సర్పంచ్ పదవిని వేలంలో దక్కించుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. గట్టు మండలం గొర్లఖాన్‌దొడ్డి గ్రామ సర్పంచ్ పదవికి చాలామంది పోటీ పడడంతో వేలం నిర్వహించారు. పోటాపోటీగా సాగిన వేలం లో ఆంజనేయులు ఏకంగా రూ.57 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నట్లు సమాచారం. దీంతో అతన్ని ఏకగ్రీవంగా చేసేందుకు గ్రామస్తులంతా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అందరూ ఏకమై సింగిల్ నామినేషన్ దాఖలు చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్న ట్లు సమాచారం.
ఎన్నికల్లో.. ప్రచారం ఇతర ఖర్చులు.. ఈసారి ఎక్కువ అవుతుండడంతో చాలా మంది క్యాండిడేట్లు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. తమను ఏకగ్రీవం చేస్తే గ్రామాభివృద్ధికి పాటుపడుతామని శపథం చేస్తున్నారు. గద్వాల మండలం, కొండపల్లి సర్పంచ్‌గా సీడ్ కృష్ణారెడ్డిని, కేటీదొడ్డి మండలం చింతలకుంటలో రాజశేఖర్ అనే వ్యక్తిని సర్పంచులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగకుండా ఏకంగా గెలుపు సంబురాలు కూడా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంపైన ఉమ్మడి జిల్లాలో తొలిరోజు నామినేషన్ల జాతర కొనసాగింది.