ఒక పాలసీ.. తెలంగాణ భూములను తెగనమ్మేందుకు సిద్ధమైంది!
అదే పాలసీ.. ఐదులక్షల కోట్ల స్కాంకు తెరలేపి వివాదాస్పదమైంది!
అదే పాలసీ మంత్రుల మధ్య చిచ్చుపెట్టి క్యాబినెట్‌ను చీల్చింది!
అబద్ధాలను నిజం చేయడానికి ఆపసోపాలు పడేలా చేస్తున్నది!
అదే అసంబద్ధ పాలసీ అధికారుల ఆగ్రహానికీ కారణమవుతున్నది!
పారిశ్రామిక భూముల పందేరానికి రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ.. ఇప్పుడు ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య యుద్ధానికి కారణమైంది. ఒకరు.. సీఎంవోలో ఉంటూ ముఖ్యనేతను ‘రంజింప’జేసే అధికారి కాగా, మరొకరు.. తనను సంప్రదించకుండా రూపొందించిన డ్రాఫ్ట్‌పై సంతకం చేయాలంటూ ఒత్తిడి చేయడం రుచించని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి!
హైదరాబాద్, నవంబర్27 (నమస్తే తెలంగాణ): సాధారణంగా పరిశ్రమల శాఖ కార్యకలాపాలు, పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ఆకర్షణ, రాయితీలు, భూముల కేటాయింపులు, టీజీఐఐసీ తదితర వ్యవహారాలు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పుడు ఇద్దరు బాస్‌ల మధ్య నలుగుతున్నదని చెప్పుకుంటున్నారు. ఒకరు పరిశ్రమల శాఖలో కూర్చొని అజమాయిషీ చేస్తుంటే, మరొకరు సీఎంవోలో ఉండి పెత్తనం చెలాయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కంపెనీల వ్యవహారాలు, పెట్టుబడులకు సంబంధించిన మెయిల్స్, ఇతర సమాచారమంతా సీఎంవోలో కూర్చున్న అధికారికి వెళ్తున్నాయని, ఆయన వాటిని చూసి అక్కడే నిర్ణయాలు తీసుకొని, కేవలం చట్టబద్ధమైన సంతకాల కోసం పరిశ్రమల శాఖ ముఖ్యఅధికారికి పంపుతున్నట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది.
ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ ముఖ్యఅధికారి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. అయితే ఆయనకు ముఖ్యనేత అండదండలు ఉండటంతో గట్టిగా ఎదురించలేకపోతున్నారని సమాచారం. సీటు వెనుక నుంచి ఆయన డ్రైవింగ్ చేస్తుంటే.. తాను రబ్బర్ స్టాంప్‌గా మారానని ఆ ముఖ్యఅధికారి తన సన్నిహితుల వద్ద ఆవేదన చెందారట. తాజాగా హిల్ట్ పాలసీతో వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి నేరుగా తలపడి, ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరిందని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి మధ్య వివాదం మొత్తం కుంభకోణాన్ని బయటపెట్టిందన్న చర్చ జరుగుతున్నది.

పరిశ్రమల శాఖలో ఏండ్ల తరబడి చక్రం తిప్పిన సీఎంవో అధికారి సర్వస్వం తానై హిల్ట్ పాలసీ రూపొందించినట్టు ప్రచారం జరుగుతున్నది. టీజీఐఐసీ ఉన్నతాధికారులను నేరుగా తన కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు తీసుకున్నారట. కనీసం సంబంధిత నిపుణులను కూడా సంప్రదించకుండా, సమీక్ష నిర్వహించకుండా, ఉజ్జాయింపు అంచనాలు, కాకి లెక్కలు వేసుకున్నట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా అవుటర్ రింగు రోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లోని 9,292.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని 4,740.14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వినియోగించేలా టీజీఐఐసీ నుంచి లేఖ రాయించారని, దాని ఆధారంగా హిల్ట్ పాలసీ డ్రాఫ్ట్‌ను రూపొందించారని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కానీ మంత్రులకు సమర్పించిన మెమోరాండంలో మాత్రం పురపాలక శాఖ, హెచ్ఎండీఏ, రెవెన్యూ శాఖ, ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ వంటి కీలక విభాగాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపిన తర్వాతే ఈ పాలసీని రూపొందించినట్టు పేర్కొన్నారట. 2022 జూన్ 25, 2025 ఫిబ్రవరి 02, 2025లో సెప్టెంబర్ 16న వనరుల సమీకరణ ఉప సంఘం సమావేశమై పాలసీ ప్రతిపాదనల మీద పూర్తిగా చర్చించి, ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు డ్రాఫ్ట్‌లో పొందుపరిచారట. దీనిపై సంతకం చేసి, అనుగుణంగా ఉత్తర్వులు విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ముఖ్యఅధికారికి పంపించినట్టు సమాచారం. అయితే ఇందులో సమావేశం మినిట్స్ అంశాలనే ప్రస్తావించలేదని విశ్వసనీయంగా తెలిసింది. ఇది ముఖ్యనేతకు అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, డ్రాఫ్ట్ కాపీని యథాతథంగా ఆమోదించాలని మాత్రమే ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
డ్రాఫ్ట్ కాపీని చూసి పరిశ్రమల శాఖ ముఖ్యఅధికారి కంగుతిన్నట్టు సమాచారం. పలు విభాగాల ఉన్నతాధికారులతో చర్చించామని, మూడుసార్లు సబ్‌కమిటీ భేటీలు జరిగాయని, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారని డ్రాఫ్ట్‌లో పేర్కొన్నారని, అయితే ‘ఇప్పటివరకు పరిశ్రమల శాఖ తరఫున నన్ను ఒక్క మీటింగ్‌కు కూడా పిలువలేదు కదా?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. జరగని అంశాలను జరిగినట్టు చూపించి అధికారిక ఉత్తర్వులు ఇవ్వడం రాజ్యాంగవిరుద్ధమని, ఇవి న్యాయ విచారణకు నిలువవని ముఖ్యఅధికారి అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. అడ్డగోలుగా జీవోలు విడుదల చేస్తే న్యాయస్థానాల ముందు తాను చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి వస్తుందని సీఎంవోలోని అధికారికి ఘాటుగా లేఖ రాశారని తెలిసింది.
వనరుల సమీకరణ ఉపకమిటీతో తాను ఒక్కసారి కూడా సమావేశం కాలేదని, భూములతో భాగస్వామ్యం ఉన్న హెచ్ఎండీఏ, పురపాలక, రెవెన్యూ శాఖలను సంప్రదించకుండా జీవోలు ఇవ్వడమంటే తన భవిష్యత్తును పణంగా పెట్టుకోవడమే అని పేర్కొన్నట్టు సమాచారం. లేఖను ఆయన సీఎస్‌కు కూడా పంపినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ అభ్యంతరాలను సీఎంవో అధికారి ముఖ్యనేత దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిసింది. దీంతో ముఖ్యనేత కల్పించుకొని పరిశ్రమలశాఖలోని ముఖ్యఅధికారికి ఫోన్‌చేసి, అభ్యంతరాలు పక్కనపెట్టి ఉత్తర్వులు జారీ చేయాలని ఒత్తిడి చేసినట్టు తెలిసింది.
ముఖ్యనేత ఒత్తిడితో పరిశ్రమల శాఖ అధికారి తప్పనిసరి పరిస్థితిలో జీవో రూపొందించినట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ క్రమంలో కొంత జాగ్రత్త పడ్డట్టు సమాచారం. వనరుల సమీకరణ సబ్ కమిటీ ప్రస్తావన లేకుండా, కేవలం టీజీఐఐసీ సూచనల మేరకే హిల్ట్ పాలసీ రూపకల్పన జరిగినట్టు జీవోలో పొందుపరిచారని సమాచారం. ఈ ఒక్క పదమే ప్రభుత్వ పెద్దలు చేసిన రూ.5 లక్షల కోట్ల అవినీతి స్కెచ్‌ను బట్టబయలు చేసిందని అటు రాజకీయ, ఇటు పారిశ్రామిక వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ప్రభుత్వం జీవో విడుదల చేసిన తర్వాత అవినీతి ఆరోపణలు రావడంతో.. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫారసుల మేరకే చేశామంటూ మంత్రులు ప్రెస్‌మీట్ పెట్టారు. కానీ జీవోలో ఆ ప్రస్తావన లేకపోవడంతో ఎలా సర్దిచెప్పుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ఇద్దరు అధికారుల మధ్య జరిగిన యుద్ధం కారణంగా గుట్టుగా సాగిద్దామనుకున్న రూ.లక్షల కోట్ల అవినీతి బయటపడిపోయిందని ప్రభుత్వ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఆ ఇద్దరు అధికారులు మాత్రం తప్పు నీదంటే.. నీదేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం.