శనివారం 06 జూన్ 2020
Mahabubnagar - May 24, 2020 , 02:34:03

రైతుకు ఉన్నత స్థానం కల్పిద్దాం

రైతుకు ఉన్నత స్థానం కల్పిద్దాం

లాభాలు వచ్చే పంటలే సాగు చేయండి

సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకెళ్లాలి

ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

పాలమూరులో వ్యవసాయ కార్యాచరణ అవగాహన సదస్సు

మహబూబ్‌నగర్‌ : ప్రతి రైతునూ ఉన్నత స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సుదర్శన్‌ కన్వెన్షన్‌హాల్లో వానకాలం-2020 వ్యవసాయ కార్యాచరణ నియంత్రిత వ్యవసాయ విధానంపై నియోజకవర్గంలోని రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్‌ వెంకట్రావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయానికి కరెంటు, విత్తనాలు, ఎరువులు, పెట్టుబడి సాయం కేవలం రాష్ట్రంలోనే రైతులకు అందుతున్నాయని అన్నారు. రైతును రాజును చేయాలనే లక్ష్యంతోనే వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. గ్రామంలోని రైతులు అందరూ ఒకే పంటను సాగు చేయకుండా వేర్వేరు పంటలను పండించాలని సూచించారు. పంటలు పండించే రైతులు నష్టపోకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహబూబ్‌నగర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని  వెయ్యి ఎకరాల స్థలంలో ఫుడ్‌ పార్క్‌ ఏర్పాటు కానున్నదని తెలిపారు. రైస్‌, పప్పు, ఆయిల్‌ మిల్లులు, గోదాముల వంటివి ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రైతులు పండించే పంటలకు సెజ్‌ వస్తుందని, జిల్లాలో 88 క్లస్టర్లు ఉన్నాయని, ప్రతి క్లస్టర్‌లో రైతు సమన్వయ సమితి భవనాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి సమస్య ఎదురైనా జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఉండే రైతు సమన్వయ సమితీలు పరిష్కరించాలని సూచించారు. తెలంగాణ నుంచి ఇతర ప్రాంతాలకు పంటలు ఎగుమతి చేసే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వ్యవసాయంలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. సోమవారం నుంచి క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి రైతుకు రైతుబంధు అందేలా చూడాల్సిన బాధ్యత రైతుబంధు అధ్యక్షులు, సభ్యులు, అధికారులదే అన్నారు. మేలు రకమైన పండ్ల, కూరగాయల తోటలు పండించేందుకు ఉద్యానవన శాఖ అధికారులతో చర్చించి మేలురకం వంగడాలను అందించే విధంగా చూడాలన్నారు. రాబోయే రోజులలో మహబూబ్‌నగర్‌ జిల్లా రూపు రేఖలు మారిపోనున్నాయని, హైదరాబాద్‌కు సమానంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. అనంతరం రైతుబంధు జిల్లా అధ్యక్షుడిగా గోపాల్‌ యాదవ్‌, హన్వాడ మండల అధ్యక్షుడిగా మెండే రాజుకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ సదస్సులో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ కోరమోని వెంకటయ్య, జెడ్పీటీసీలు, వైస్‌ ఎంపీపీలు, ఎంపీడీవోలు, తాసిల్దార్లు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. 


logo