ఉపనిషత్తుల వేదాంతం.. సూఫీతత్వం..
భారతీయత అన్ని మతాలకు, సంప్రదాయాలకు తగిన స్థానం ఇచ్చింది. మహ్మద్ ప్రవక్త జీవించి ఉన్నప్పడు నిర్మించిన రెండు మసీదుల్లో ఒకటి మక్కాలో ఉండగా, రెండవది కేరళలోని మలబారు తీరంలో ఉన్నది. పూర్వం మన దేశంలోని ముస్లింలు మలబార్‌కు వెళ్లిన తర్వాత హజ్ యాత్ర చేయడం విశేషం. భారతీయతలోని తాత్విక దృక్పథాన్ని స్వీకరించి గురు పీఠ సంప్రదాయం కూడా ఇస్లాం మతంలో ఏర్పడింది. 1. ఖాదరియా, 2. చిస్తీయా, 3. సోహ్రావర్దియా, 4. నక్షబందియా అనే సంప్రదాయాల్లో మన దేశంలోని ఇస్లాం ఒకప్పుడు బాగా అభివృద్ధి చెందింది. ఖాదరియా సంప్రదాయ మూలపీఠం బాగ్దాద్‌లో ఉండగా ఆ పీఠాధిపతిని ఇరానీ అని పిలిచేవాళ్లు. చిస్తీ సంప్రదాయం అజ్మీర్‌లోని ఖ్వాజా గరీబన్నవాజ్ ద్వారా ప్రసిద్ధి పొందింది.
ఈ సంప్రదాయాలు మన దేశ ముస్లిం కుటుంబాలను బాగా ప్రభావితం చేశాయి. అలా ప్రభావితం అయినవాళ్లలో నాగర్‌కర్నూల్ జిల్లా వసంతాపురం గ్రామంలోని బాలాసాహెబ్ కుటుంబం ఒకటి. ఈయన భార్య పేరు ఫఖ్రున్నీసా. వీళ్ల చివరి సంతానం ఖ్వాజా అహమదోద్దీన్ 1905లో జన్మించాడు. బాలాసాహెబ్ మాలీ పటేల్‌గా పని చేసేవాడు. తన ఇంటి నిర్మాణం కోసం నల్లమలకు వెళ్లి కలప తెచ్చే సందర్భంలో ఆయనకు అల్లాజీ అనే అవధూత తారసపడ్డాడు. బాలాసాహెబ్ తనతోపాటు అల్లాజీని వసంతాపురం రమ్మన్నాడు. ఆయన వసంతాపురం అల్లాజీగా తర్వాతి కాలంలో ప్రసిద్ధుడయ్యాడు.
12 ఏండ్ల వయసున్న అహమదోద్దీన్ అల్లాజీ వెంట తిరిగేవాడు. ఆయన అనుగ్రహంతో వరకవిగా మారాడు. 15 ఏండ్ల వయసులో కవిత్వం చెప్పడం మొదలుపెట్టాడు. తెలుగు, హిందీ, ఉర్దూ లో తత్వాలు, కీర్తనలు, కందార్థాలు, నజమ్స్, గజల్స్ చెప్పాడు. ఈ కవీశ్వరుడి రచనలను ‘అహమదోద్దీన్ ఆత్మతత్వములు’ పేరుతో 5 భాగాలుగా 1952లో ఒకసారి, 1997లో మరోసారి ముద్రించారు. మొదటి భాగంలో 65 తత్వాలు, ప్రతి తత్వం తర్వాత ఒక వృత్తం, రెండు కందార్థాలున్నాయి. ఆ వృత్తాలను చంపకం అని పేర్కొన్నారు. వాటిలో కొన్ని ‘మనసా’ అని, మరికొన్ని ‘గురువరా’ అని సంబోధనలో ఉన్నాయి. రెండవ భాగం లో 160 కందార్థాలు, మూడవ భాగంలో 193 తత్వాల తర్వాత 102 పాదాల సంకీర్తన ఒకటి ఉంది. నాల్గవ భాగంలో మళ్లీ గీతాలు, ఆటవెలదులు. ‘ధరవసంతా పురదాస చిద్విలాస’ అనే మకుటంతో ఇవి సుమారు 534 వరకు ఉన్నాయి. అయిదవ భాగంలో తత్వాలు (మూడవ భాగానికి కొనసాగింపుగా) 194 నుంచి ప్రారంభమై 207తో ముగిశాయి. ఆ తర్వాత 208 నుంచి 241 వరకు ఉర్దూలో గజల్స్ రచింపబడ్డాయి. ఇవి భజన తర్వా త నిలబడి చదవాలని సూచన ఉంది. ఇలా ఈ కృతిలో మొత్తం 306 తత్వాలు, 286 కందార్థాలు, 65 వృత్తాలు, 102 పాదాల సంకీర్తన మాలిక, 534 ఆటవెలదులు, 34 గజల్స్.. అన్నీ కలిపి మొత్తం 1,257 రచనలున్నాయి.
తెలంగాణలో ఉర్దూ వీధి బడుల్లోనే పాక్షికంగా తెలుగు చెప్పేవారు. అలాంటి చోట చదువుకొన్న అహమదోద్దీన్ ఇంత అద్భుతమైన కవితా రచనలు చేయడం విశేషం. ఈ తత్వాలు అచిరకాలంలో ఆ ప్రాంతమంతా అందరూ దేవాలయాల్లో, మఠాల్లో సైతం ఆలపించడం మొదలుపెట్టారు. హిందువులు ఆయనను ‘ఆమదయ్య’ అని పిలిచేవారు. ఆత్మజ్ఞానిగా, అచలుడిగా, తాత్వికుడిగా, ధార్మికుడిగా, నిజమైన లౌకికవాదిగా కన్పించే అహమదోద్దీన్కు తెలంగాణ సాహిత్య చరిత్రలో గొప్ప పీఠం ఇవ్వాల్సి ఉంది. 65 ఏండ్లు జీవించిన అహమదోద్దీన్ 1970 అక్టోబర్ 20న కన్ను మూశాడు. వసంతాపురంలో వీరి పేర ఏటా ఉర్సు జరుగుతుంది.
భాగవతుల కృష్ణప్రభువు కృషి వల్ల కందార్థాలు బాగా ప్రసిద్ధి పొందిన కాలమది. ఆయన శుద్ధ నిర్గుణ కందార్థాలు.. తత్వకవులందరికీ మార్గదర్శనం చేశాయి. అలాగే అహమదోద్దీన్ను ప్రభావితం చేశాయి. తను చెప్పదలచుకొన్న విషయాన్ని కందార్థాల్లో సూటిగా, స్పష్టంగా అహమదోద్దీన్ చెప్పాడు.
కులవాదము మనకేలను మలమూత్రములతో గూడె మాయా ఘటముల్ ఇలలో సద్గురు మంత్రము కలనైనను మరువబోకుము కోరి దల్వుమురా అల్లరీ తనమూ విడిచి నిల్వుమురా..కలిమీలేములు గోరుటేమి కారణమింక తల్లీ గర్భమున్న జాడ కనుగొను మళ్లీ కోరీ దల్వుమురా’ అంటాడు. అలాగే… ‘లేదు లేదు ముక్తీ గోత్రము కులము కాదు కాదు భక్తీ లేదు గోత్రము కులముయేది యెట్టున్నదీ పాదు తెల్లని శాస్త్రవాదులెల్లను చూడ’ అంటూ కులగోత్రాల్లోని సంకుచితత్వంపై యుద్ధం ప్రకటిస్తాడు. మరోవైపు, తనకు అభిమానం కల్గించే అన్నింటినీ సద్గురువుకు అర్పించానని చెప్పారు.
ఈ తనువు ఈ మనసూ సద్గురు కమ్మినాను
వ్రాతా ఫలములేమున్నా అర్పించినాను
జాతి భేదములనెల్ల ఖండించినాను
జ్యోతిగాను ఈ క్షితిలో జన్మించినాను
సూటీ హృదయాన నాటి పలికినాను
మేటీ చింతయనె సాగరము దాటినాను
ధ్యానధారణము మానకుండినాను
ఉన్నా విన్నా అన్నా కన్నా కన్నులార
రంగు కాని రంగు సంగతెర్గినాను
అంగామందు జ్యోతిర్లింగామెర్గినాను
అహం బ్రహ్మ అస్మి అల్లాజి ఆయే తాను
సోహం అహమదోద్దీన్ స్నేహంబయ్యినాను
ఇతడి తత్వాలు భజనలో గానయోగ్యంగా, పండిత పామర జనరంజకంగా ఉంటాయి. జాతిభేదాలు నీతి కాదని అహమదోద్దీన్ వాదిస్తాడు.
ఉర్దూ, తెలుగు, సంస్కృతం మూడు భాషలనూ ఆయన ఉపయోగించారు. ఝాటా, వహ్వా, సర్దార్‌బేగ్, సహులియ్యత్ వంటి ఉర్దూ పదాలు మధ్యమధ్యలో పాయసంలో బాదం పలుకుల్లా తగులుతాయి. అలాగే సరళమైన పామరభాష ఇతని సొంతం. రజం చేయడం, పూటపూటకు, పదితావులల్ల నొష్టి ఝడిసితె, మింటికె మంటికె, ఇర్గదొక్కడం, గసిబిసి, పీకులాడి మారుజన్మ, పట్టుమని,పాటిదప్పక, కొంచెపు ఆశ.. లాంటి పాలమూరు పదసంపద ఇతని తత్వాల్లో మెరుస్తుంది. వేదాంతంలోని గహనమైన విషయాలు చెప్పేటప్పుడు క్షితిపతి, అహంబ్రహ్మాస్మి, సోహం, సంచితం, హంస, గర్వ సంహరుడు, చిద్రూప కళలు, బ్రహ్మనాదం, చిన్మయరూపు.. వంటి సంస్కృత పదాల పోహళింపూ కనిపిస్తుంది.
సద్గురువును సేవిస్తే సత్యం బోధపడుతుందనే అహమదోద్దీన్ సిద్ధాంతం భారతీయతలో గురుతత్వానికి ఉన్న ప్రాముఖ్యతను ప్రస్ఫుటపరుస్తున్నది.
‘యెందుజూచిన బ్రహ్మం సందులేకున్నాది
ముందు సద్గురుపాదం అందీ సేవింపూచు పొంది
నిలకడచే చిద్బిందు నిలిపిన వెనుక’ అంటూ చిద్బిందును తెలుసుకోవాలంటే గురుపాదం కీలకం అంటాడు. పరమాత్మను తెలియని వేషధారులను నిరసించాడు. మోసంతో ఆధ్యాత్మికతను సాధించలేరని అహమదోద్దీన్ భావం.
‘ఈశుని జాడల నెరుగక దాసుడనని వేషమేసి దిరుగకు ధరలో
వాసికి యెక్కకు వినుమిక నాసి ద్వారంబులో నానదు పారామంత్రం’
అంటాడు ఓ కందార్థంలో. దేవుడు ఒక్కడే అన్న వాదంతో ఏకేశ్వరారాధనను ఆయన బాగా ప్రచారం చేశాడు. ఈశ్వరుడిని తెలుసుకొనేందుకు గొప్ప సాధనం గురువే అనే భారతీయ తత్వ చింతనను వ్యక్తం చేశాడు.
గురుడేనన్న గన్నవరుడే దయపరుడే
పరతత్వ సమార్పిత హరుడేనిజ
క్షరమాక్షరము గుర్తుగనుటకిటు
తారకమంత్రము మరువకు మనె నిజ
అచలంలో గురు ప్రాధాన్యత ఎలాంటిదో అహమదోద్దీన్లో కూడా అలాంటి గురుస్తుతి అడుగడుగున కన్పిస్తుంది. ఇది పైకి సూఫీలా అన్పించినా సనాతన సంప్రదాయ ఛాయలు ప్రతి తత్వంలో ఉన్నాయి. ఇదే ఆనాడు అహమదోద్దీన్ను అందరి దగ్గరకూ చేర్చింది. అచ్చమైన గ్రామ్యాలను తత్వశాస్త్రంలో ప్రవేశపెట్టడం ఆయన ఘనత.
లక్ష్యభావం, యోగం, కుండలిని, నిర్గుణతత్వం, పాపపుణ్యాలు, ధర్మాధర్మ విచక్షణ, వ్యామోహ నిరసన, వైరాగ్యం, విగ్రహారాధనపై వ్యతిరేకత, కులభేద నిరసన, గురుభక్తి, అంధవిశ్వాసాలపై తిరుగుబాటు, లౌకిక జీవనం, బూటక భక్తి నిరసన, ఏకేశ్వరారాధన, మాతృపితృభక్తి వంటి భారతీయ తాత్విక చింతనలో అంతర్భాగాలైన అనేక విషయాలు అహమదోద్దీన్ రచన ల్లో కన్పిస్తాయి. ఆయనకు హిం దూ శిష్యులు కూడా ఉండేవా రు. అహమదోద్దీన్ తత్వాన్ని వారు భజన మండళ్ల ద్వారా వ్యాప్తి చేసేవారు. ఉపనిషత్తు వేదాంతం, సూఫీ తత్వం, అచల బోధ, ఆత్మజ్ఞానం అన్నీ కలగలిసిన అహమదోద్దీన్ శుద్ధ వేదాంతి. సామాజిక సమరసత సాధించిన కవీశ్వరుడు.
డాక్టర్
పి.భాస్కరయోగి