సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): సైబర్‌నేరాలకు వాడుకున్న మ్యూల్ అకౌంట్ల నెట్‌వర్క్‌ను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. చైన్సిస్టమ్ ద్వారా తమకు తెలియకుండానే తమ ఖాతాల్లో లావాదేవీలు నిర్వహించేందుకు అనుకూలమైన మ్యూల్ అకౌంట్లను తయారుచేస్తున్న ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు ఈ ముఠాకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. మొదట ఈ అకౌంట్లను తాము గుర్తించడానికి ఒక వ్యక్తి తమ దగ్గరకు వచ్చి అకౌంట్ తెరిస్తే డబ్బులు ఇస్తారని చెప్పారని, దీనిపై తనకు అనుమానం ఉన్నదని తీగ లాగితే డొంకంతా కదిలి ఈ చైన్సిస్టమ్ బయటపడిందని శ్రీనివాసులు పేర్కొన్నారు.
మ్యూల్ అకౌంట్ల ముఠాకు సంబంధించిన ఎనిమిది మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. చిలకలగూడలో పూజారి జగదీశ్ అనే ఆటోడ్రైవర్‌తో మొదలుకొని సునీల్‌కుమార్, మణిదీప్, పారుపల్లి నిఖిల్, బొల్లుబాలు, బత్తుల పవన్, ఓలా ప్రవీణ్, బిరావత్ బాలాజీ నాయక్‌లను అరెస్ట్ చేశామని తెలిపారు. ఒకరోజు జగదీశ్ ఆటోలో రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య అనే వ్యక్తి ఎక్కి అతనిని మాటల్లో దించి బ్యాంక్ ఖాతా తెరిస్తే డబ్బులు ఇస్తానని చెప్పడంతో అది నమ్మి తన ఆధార్‌కార్డ్ ఇచ్చానని, అదేవిధంగా కన్నయ్య ఇచ్చిన సిమ్‌తో బ్యాంక్ ఖాతా తెరిచారని చెప్పారు.
అక్కడి నుంచి మొదలై క్రమక్రమంగా 127 ఖాతాలు తెరిచారని, వీటిద్వారా పలు రకాల సైబర్ నేరాలకు సంబంధించిన రూ.24,10,16,618 డబ్బులు డిపాజిట్ కాగా అందులో రూ.23,99,31,550ను నేరగాళ్లు విత్ డ్రా చేశారని, మిగతా రూ.16లక్షలను తాము ఫ్రీజ్ చేశామని అడిషనల్ సీపీ తెలిపారు. ఒక మ్యూల్ అకౌంట్ తెరిస్తే పదివేల నుంచి రూ.15వేలు ఇవ్వడంతో ఆశపడిన ఈ ముఠా తమ ద్వారా చాలామంది ఆధార్‌కార్డులు, అడ్రస్ వివరాలు ఇచ్చి కన్నయ్య ఇచ్చిన సిమ్‌కార్డులతో బ్యాంక్‌ఖాతాలు తెరిచారని, ఆ తర్వాత ఏకంగా ఈ మ్యూల్ అకౌంట్ల సూత్రధారి రాజస్థాన్‌కు చెందిన పూనమ్ ద్వారా లావాదేవీలు నిర్వహించారని శ్రీనివాసులు చెప్పారు. ఈ నెట్వర్క్ తీసిన ఖాతాలతో పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు.
ఇందులో రాజస్థాన్‌లో 1, కర్ణాటకలో 3, సైబరాబాద్, రాచకొండల్లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదైనట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. వీరిలో బాలాజీనాయక్ బ్యాంక్‌లో పనిచేస్తూ అకౌంట్స్ ప్రమోట్ చేసే తాత్కాలిక ఉద్యోగి కావడంతో అతని వల్ల కూడా చాలా అకౌంట్లు తయారయ్యాయని, అతనిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. సైబర్‌నేరాల్లో ఈ మ్యూల్ అకౌంట్లే కీలకమని చెప్పారు. తమ బ్యాంకుల్లో ఎవరు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారో బ్యాంకు సిబ్బంది నిఘా పెట్టాలని శ్రీనివాస్ సూచించారు. తెలియకుండా మీ అకౌంట్లో డబ్బులు పడి అకౌంట్ ఫ్రీజ్ అయి ఉంటే సైబర్ పోలీసులను కలిసి తమకు సంబంధం లేదని రాసిస్తే, దానిపై దర్యాప్తు చేసి ఖాతాను పునరుద్ధరిస్తామని శ్రీనివాస్ చెప్పారు.