చలి పిచ్చి పిచ్చిగా కరుస్తోంది అందరినీ
పిల్లిలా వచ్చి పులిలా మారింది
ఏం మాయ చేసిందో గాలిని వలలో వేసుకున్నది
కిటికీ సందో, తలుపు సందో దొరికితే చాలు
దూరిపోయే అస్త్ర శస్త్ర విన్యాసిని
ఎదుర్కోవడం చేతకాక స్వీయ రక్షణ చర్యలు
నాడు గొంగళ్ళు, మఫ్లర్లు, దుప్పట్లు
నేడు స్వెట్టర్లు, టోపీలు, బ్లాంకెట్లు ఎన్నెన్నో..
నిన్నటిది కాదు, మొన్నటిది కాదు పాతదే, తెలిసిందే
ఏటా కొత్త సంసారం పెట్టినట్టే ఉంటది
ఏటేటా ముంచుతది, ఈసారి మరింత వస్తాదులా
బరిలో దిగితే పోటీ చేసే దమ్ము లేదెవరికీ
నిండా మునిగాక చలేంటన్నారట వెనుకటికెవరో
చన్నీళ్లు తాకితే, తాగితే జిల జిల
నీళ్లలో మునిగి బయటకొచ్చాక వణుకుడు రోగం
చెలిని దగ్గరకు చేర్చింది చలి
పాపను ఒడిలోకి చేర్చి కొంగు కప్పింది
ఆరుబయట మంటలు వేయిస్తోంది చలి
తెల్లారుజాముల కుండపోతలా మంచును కురిపించి
రోడ్లను ప్రమాదాల పతాక శీర్షిక చేస్తోంది
చలిపులిని తప్పించుకోవడం ఎవరి తరం
మచ్చిక చేసుకోవడం శ్రమజీవులకే సాధ్యం
చెమట పట్టకుండా కాపాడటం భావిస్తది బాధ్యతగా
చలికి ముసుగేసుకొని ముసలమ్మలా ఇంట్లో పడుంటే
చర్మమే కాదు కీళ్ళు పలకరిస్తుంటాయి కిర్రుమంటూ
చలిని, మంచును ఏలుతున్న ఊర్లు పర్యాటక ప్రాంతాలు
హిమాలయ సౌందర్యాలు, అవనికి అందాలు
గుహలో వెలిసే అమరనాథుడు
అక్కడివారికవే జీవనాధారాలు, ఆదాయ మార్గాలు
-కొమురవెల్లి అంజయ్య
9848005676