నిజామాబాద్, నవంబర్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈసారి సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే ఎస్ఈసీ సిద్ధమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సర్కారు వెనుకంజ వేయడంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే జరుగబోతున్నాయి. మొత్తం మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వారాల సమయంలోనే మొత్తం ప్రక్రియ ముగియనుంది. నవంబర్ 27తో తొలి దశ ఎన్నికల ప్రక్రియ షురూ అవుతుండంగా డిసెంబర్ 17తో మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగుస్తాయి.
ఒకే రోజు పోలింగ్, ఓట్ల లెక్కింపు, అదే రోజు ఫలితాల వెల్లడి చేపట్టబోతున్నారు. సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ జారీ కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనుండగా డిసెంబర్ 11న తొలిదశ, డిసెంబర్ 14న రెండో దశ, డిసెంబర్ 17న మూడో దశ ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 27 నుంచి తొలి దశ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. రేపటి నుంచే నామినేషన్ల పర్వం షురూ అవుతుంది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. గంట విరామం తర్వాత మధ్యాహ్న 2గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ షురూ అవుతుంది. నిజామాబాద్ జిల్లాలో 545 జీపీలు, 5022 వార్డులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 532 జీపీలు, 4656 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.
రేపటి నుంచే నామినేషన్లు…
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు నవంబర్ 27న మొదలు కానుంది. రెండో విడతకు నవంబర్ 30వ తేదీ నుంచి షురూ కానుంది. 3వ విడత నామినేషన్ల పర్వం డిసెంబర్ 3న షురూ కానుంది. తొలి విడతకు, రెండో విడతకు మధ్య రెండు రోజుల సమయాన్ని ఎస్ఈసీ కల్పించింది. రెండో విడతకు మూడో విడతకు మధ్య కూడా రెండు రోజుల సమయాన్ని ఇచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం నుంచి పోలింగ్, కౌంటింగ్ ముగింపునకు మధ్య 14 రోజుల సమయాన్ని ఎన్నికల సంఘం ఇచ్చింది. తొలి విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులకు కేవలం రెండు వారాలు మాత్రమే ప్రచారానికి సమయం దొరుకుతోంది. రెండో విడతలో పోటీ చేసే వారికి షెడ్యూల్ జారీ నుంచి మొదలు పెడితే అదనంగా నాలుగైదు రోజులు కలిసి వస్తోంది. తుది విడతలో పోటీ చేసే వారికి దాదాపుగా మూడు వారాల సమయం దక్కుతోంది. ప్రచారానికి అధిక సమయం దక్కడం ఒకింత మంచిదే అయినప్పటికీ ఎన్నికల ఖర్చు తడిసి మోపెడు అవుతుందనే బాధ కూడా తుది విడతలో పోటీ చేసే వారికి ఏర్పడింది.
పొద్దున చీరల పంపిణీ..సాయంత్రం ఎన్నికల కోడ్..
సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తాయిళాలను అధికారికంగానే అందించింది. సాయంత్రం 6.15 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల ప్రకటన ఉంటుందని తెలిసి హడావిడిగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసింది. జిల్లా కలెక్టర్లకు సీరియస్‌గా ఆదేశాలు జారీ చేసి సాయంత్రానికి కల్లా అర్హుల జాబితా మేరకు చీరలు అందించారు. మరోవైపు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు సైతం పంపిణీ చేశారు. కొన్ని చోట్ల రుణాల పంపిణీ సంపూర్ణంగా అందివ్వలేదు.
నవంబర్ 25వ తేదీతో రుణాల మంజూరు పత్రాలను ఎన్నికల కోడ్‌లోనే పంపిణీ చేసేందుకు కుయుక్తులు పన్నినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం ఈ వ్యవహారంలో ఏం చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి చీరల పంపిణీని ప్రభుత్వం పకడ్భందీగా చేపట్టినప్పటికీ క్షేత్ర స్థాయిలో మహిళా లోకం నుంచి అంతగా స్పందన రావడం లేదు. కేసీఆర్ అందించిన బతుకమ్మ చీరెలతో పోలిస్తే కాంగ్రెస్ సర్కార్ ఇస్తోన్న చీరెలను ప్రజలు అంతగా మెచ్చడం లేదని తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ తన చేతులో ఉన్న అధికారాన్ని అడ్డంగా వాడుకుంటుండటంపై సర్వత్రా వ్యతిరేక వ్యక్తం అవుతోంది.

ఏ మండలం.. ఏ విడుతలో?
నిజామాబాద్, నవంబర్ 25, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు ఉండగా మూడు విడతల్లో ఒక్కో విడుత ఎన్నికల్లో చేర్చారు. మొదటి విడుతలో బోధన్ డివిజన్ పరిధిలో బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలూర, వర్ని, ఎడపల్లి, నవీపేట మండలాలున్నాయి. రెండో విడతలో నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్‌పల్లి మండలాలు పేర్కొన్నారు. మూడో విడుతలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, ఆలూర్, బాల్కొండ, భీంగల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట, వేల్పూర్, ఏర్గట్ల మండలాలున్నాయి.
కామారెడ్డి జిల్లాలో మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఇందు లో మొదటి విడుతలో కామారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని భిక్కనూర్, బీబీపేట, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాలకు పోలిం గ్ ఉంటుంది. రెండో విడుతలో బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాం ధారి, ఎల్లారెడ్డి, మహ్మద్‌నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాలకు ఎన్నికలు ఉంటాయి. మూడో విడుతలో ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాలు ఉన్నాయి.
