కొడవటిగంటి కుటుంబరావు (కొ.కు.) 1937 నాటికే సామాజిక ప్రయోజనం పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో ఉండేవారు. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఎంతో ఉన్నదని, ఆ ప్రయోజనం సాధించడానికే వందల కొద్దీ కథలు, ఎన్నో నవలలు, మరెన్నో వ్యాస సంకలనాలు, నాటికలు, గల్పికలూ రచించారు.
మన సమాజం మరింత ముందుకు వెళ్లాలంటే ముందు మన సంస్కారానికి పదును పెట్టుకోవడం అవసరమని, అందుకు సాహిత్యం ఆకురాయిగా ఉపయోగపడుతుందని స్పష్టమైన ప్రగతిశీల దృక్పథంతో ఆయన తన రచనలు చేస్తున్న మొదట్లోనే ఉన్నారు. తాను చూసిన విషయాలకు, విన్న విషయాలకు కాల్పనికత జోడించి తన తరంలో, తరువాతి తరంలో కూడా నిలిచి ఉండేట్టు రచన చేయాలంటే సామాన్య విషయం కాదు. అనన్య సామాన్యులకే అది సాధ్యం. రచయితలు తమ భావాలు ప్రకటించడానికి ఏ భాషలోనైనా అనేక భాషా ప్రక్రియలున్నాయి. కానీ, ఏ భాషలోనైనా ఎక్కువ ప్రాముఖ్యం కలిగి జనానికి బాగా చేరువ కాగలిగింది కథా ప్రక్రియ ఒక్కటే. కుటుంబరావుకు కూడా కథా రచన అంటే నల్లేరు మీద నడకే. అందుకే, వందల కొద్దీ కథలు పునరుక్తి లేకుండా రాశారు.
‘చిన్నకథ- సామాజిక వ్యవస్థలో మార్పు’ అన్న వ్యాసంలో ఇలా అంటారు కుటుంబరావు. ‘మానవ జాతి ఎటుపోతున్నది? ఎటు పోవాలి? దారిద్య్రమూ, అనారోగ్యమూ, సంకుచితత్వమూ, యుద్ధభయమూ, కులతత్వాలూ, మతతత్వాలు ఇటువంటి సాంఘిక పీడలు నిర్మూలనమై ప్రజలు స్వేచ్ఛగా అవాంతరాలు లేకుండా విభేదాలు పోగొట్టుకొని తమ ఆర్థిక, విజ్ఞాన, నైతిక జీవితాలను గట్టి పునాది మీద నిర్మించుకోవడానికి మార్గమేది? కథకులు కూడా ఈ సమస్యలకు ఎడంగా నిలబడి ఉండలేరు. ఇటువంటి ప్రశ్నలకు వీరు సమాధానం తెలుసుకునేకొద్దీ కథలు జీవితానికి మరింత సన్నిహితంగా వచ్చి జీవిత సత్యాన్ని చిత్రించగలుగుతాయి’.
సాహిత్యం మానవ జీవిత ప్రతిఫలం. జీవిత సత్యం వ్యక్తం చేయని సాహిత్యం వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదని తన రచనలన్నింటిలోనూ వినిపిస్తారు కొడవటిగంటి కుటుంబరావు. స్త్రీ, పురుషులిద్దరూ సహజమైన అన్యోన్య ప్రేమ వల్ల ఎక్కువ శాతం ఏకపత్నీత్వం, ఏక భర్తృత్వంనే కోరుకుంటారు. జీవ పరిణామానికి జీవకణం ఎంత ముఖ్యమో సహజ పరిణామానికి కుటుంబం అంత ముఖ్యం. మానవుని మూర్తిమత్వం కుటుంబంలోనే వికసిస్తుంది. స్త్రీ, పురుష సంబంధాలు, వివాహం, ప్రేమ, పిల్లల పెంపకం ఇవన్నీ సామాజిక వ్యవస్థ లేదా కుటుంబ వ్యవస్థ కిందికి వస్తాయి. ఈ కుటుంబ వ్యవస్థ గురించి కుటుంబరావు వందకుపైనే కథలు రాసి ఉంటారు. కుటుంబరావు రాసినంత విలక్షణంగా ఈ కుటుంబ కథలు రాసినవారు చాలా తక్కువే ఉన్నారు. ప్రేమ గురించి, పెండ్లి గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి చాలా కచ్చితమైన అభిప్రాయాలు కుటుంబరావువి. 1931-1942ల మధ్య వచ్చిన కుటుంబరావు రచనలు ఎక్కువగా కుటుంబ బంధుత్వ సంబంధాలు, స్త్రీ పురుష సంబంధాల పరంగా వచ్చినవే.
ప్రేమించే స్వేచ్ఛ ఆనాటి సమాజంలో తక్కువగా ఉన్నదని అనేక కథల్లో నిరూపిస్తారు కుటుంబరావు. వ్యాపారం కంటే పెండ్లి భిన్నం కాదనీ, హీనమైన వ్యాపారంలా ఉన్నదనీ నిరూపిస్తారు. మధ్యతరగతి ఆలోచనాశీలిగా ఉన్న కుటుంబరావుకు ఉన్న అవగాహన అపారం. మధ్యతరగతి జీవన స్థితిగతులు, మధ్య తరగతి జీవితావస్థలలోని అనుభూతులు వీటిని గూర్చి సమగ్రమైన సమాచారం ఈయన కథల్లో మనకు దొరుకుతుంది. పిల్లల పెంపకాల్లో, సంబంధ బాంధవ్యాల్లో, ప్రేమల్లో, స్నేహాల్లో, వివాహ సంబంధాల్లో, స్వేచ్ఛలో, నీతిలో, అభిరుచుల్లో, విశ్వాసాల్లో, ఇంకా ఇంకా అనేకానేక భౌతిక, వాస్తవిక విషయాల్లో ఉన్న పరిస్థితిని చిత్రించారు. ఒక్క మాటలో చెప్పాలంటే వాస్తవికతా వాదానికి కుటుంబరావు రచనలు, కథలూ సంకేతం.
కుటుంబ పరమైన చైతన్యాన్ని ఆయన ఏనాడూ ఒక జడ పదార్థంగా చూడలేదు. ఆ చైతన్యం ఏకోన్ముఖమైందని ఆయన నమ్మలేదు. చరిత్ర ప్రభావం లేని సాధారణ కుటుంబ జీవితాన్ని ఆయన పరిగణించలేదు. కుటుంబం ఆయన దృష్టిలో ఒక సంక్లిష్ట జీవపదార్థం. దాని స్వభావాన్ని నిర్ణయించేది ఆర్థిక యథార్థమూ, చరిత్ర వాస్తవమూ, దానిలోని మనుషులూ. ఆ మనుషులు కూడా మూస పోసినవాళ్లు కాదు, ప్రత్యేక లక్షణాలు, సామాన్య లక్షణాలు కలిసిన సజీవవ్యక్తులు. మరోరకంగా చెప్పాలంటే కార్య శూరత్వం కంటే ఆలోచనా పటిమ ఎక్కువ. చరిత్ర సృష్టించగలిగినవాళ్లే కాదు, ఆ చరిత్రను గమనించగల సత్తా ఉన్నవాళ్లే కుటుంబరావు కథల్లో ఉండే కుటుంబీకులు.
-బి.అనసూయ