భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ‘దీక్షా దివస్’ సన్నాహక సమావేశంలో వద్దిరాజు మాట్లాడారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార పార్టీ తంటాలు పడుతోందని, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 42 శాతం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ చివరికి పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికీ బీసీలకు ద్రోహం చేయడమేనని దుయ్యబట్టారు.
ఆరు గ్యారెంటీలను అమలుచేయలేక, ఎన్నికలకు వెళ్లే ధైర్యంలేక న్యాయస్థానం చెప్పేవరకు చేసుకుందని విమర్శించారు. అందుకే పార్టీ గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని, ఎవరు గెలిచినా తమవాళ్లే అని చెప్పుకోవడం కోసం ఈ తతంగం చేస్తోందని ధ్వజమెత్తారు. రేగా కాంతారావు మాట్లాడుతూ.. తమ పార్టీ అధినాయకత్వం సూచనల మేరకు జిల్లా శ్రేణులు నడుచుకుంటున్నట్లు చెప్పారు. భద్రాద్రి జిల్లాలో గులాబీ పార్టీకి మంచి పట్టుందని, స్థానిక ఎన్నికలే గాక అసెంబ్లీ ఎన్నికలొచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేల్చిచెప్పారు. భద్రాచలంలో ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తుందని స్పష్టం చేశారు. మణుగూరులో పార్టీ కార్యాలయం విషయంలోనూ కాంగ్రెస్సే అభాసుపాలైందని విమర్శించారు. కొత్తగూడెం ఎన్నికల ఇన్చార్జిగా ఎంపీ వద్దిరాజు వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

దీక్షా దివస్ను విజయవంతం చేయాలి
29న జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, నాయకులు మానె రామకృష్ణ, దిండిగాల రాజేందర్, కాపు సీతాలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి వందకు తగ్గకుండా కార్యకర్తలు వస్తారని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు వెంకటరెడ్డి, పోశం నరసింహారావు, రావులపల్లి రాంప్రసాద్, సంకుబాపన అనుదీప్ తదతరులు పాల్గొన్నారు.