అటు పాల్కుర్కి సోమనాథుడు, ఇటు పావులూరి మల్లన, నన్నెచోడుడు, వేములవాడ భీమకవి, నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, కవయిత్రి మొల్ల, గోన బుద్ధారెడ్డి, శ్రీనాథుడు, చేమకూర వెంకటకవి రంగాజమ్మ… ఇలా చెప్పుకొంటూ పోతే తెలుగు సాహిత్య సుసంపన్న సృష్టికర్తలు, చరిత్రకు ఎక్కినవారి పేర్లను మాత్రమే చెప్పాలంటే పెద్ద ఉద్గ్రంథమే అవుతుంది.ఇక చరిత్రకు ఎక్కని మహోన్నత తెలుగు సాహితీమూర్తుల గురించి చెప్పాలంటే రెండు, మూడు ఉద్గ్రంథాలను రాయవలసి ఉంటుంది.
తెలుగు సాహిత్యమూర్తుల పేర్లను అటుంచితే తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ్యకు వచ్చినంత పేరు, ప్రతిష్టలు పావులూరి మల్లనకు రాలేదు. పావులూరి మల్లన కూడా 11వ శతాబ్దంలోనే గణిత సారసంగ్రహం అనే పేరు గల గణిత గ్రంథాన్ని రాశాడని కొందరంటారు. మరికొందరు నన్నయ కంటే పావులూరి మల్లనే ముందంటారు.
హితాన్ని కోరే తెలుగు సాహిత్యం పుట్టిన సమయంలోనే విజ్ఞానమయమైన గణిత సాహి త్య తేజం కూడా తెలుగు సాహిత్యాన ఆవిర్భవించింది. అయితే, మన తెలుగు సాహిత్య పండితులు అధిక శాతం పావులూరి మల్లన గురించి, ఆయన ఎప్పటివాడు, ఎక్కడివాడు? ఆయన శైవమతస్థుడా? వైష్ణవ మతస్థుడా? అతను శైవ మతస్థుడనడానికి అతని గణిత గ్రంథంలో కనపడుతున్న సాక్ష్యాలేమిటి? అన్న అంశాల మీద పరిశోధనలు చేసినంతగా అతను తన గణిత గ్రంథంలో స్పృశించిన మహోన్నత గణిత అంశాల మీద పరిశోధన చేయలేదు. తెలుగు సాహిత్యానికి ఉన్న గణిత తేజం అనిర్వచనీయం అని చాటిచెప్పలేదు.
సంస్కృతమున మహా వీరాచార్యుడు రాసిన ‘గణిత సార సంగ్రహం’ మల్లన రచనకు మాతృక అని కొందరంటారు. అయితే, మల్లన గణిత సార సంగ్రహంలోని పద్ధతులనే తెనిగించారు. వారి గ్రంథంలోని లెక్కలను మల్లన స్వతంత్రంగానే కల్పించారు. మల్లన తమ గణిత గ్రంథాన్ని పది అధ్యాయాలుగా విభజించారు.
ఆధునిక గణితాన్ని అబ్బురపరిచే గణింతాంశాలు మల్లన గణితంలో అనేకం ఉన్నాయి. మల్లన గణిత గ్రంథంలోని పది అధ్యాయాలను క్షుణ్ణంగా అభ్యసిస్తే నేటి ఎంసెట్ వంటి అనేక గణిత పరీక్షలను సునాయాసంగా ఎదుర్కొనవచ్చు. ఉదాహరణకు సంకలన వ్యవకలన గుణకార భాగ హార వర్గ వర్గమూల ఘన ఘనమూలాది విషయాలలో పావులూరి మల్లన పద్య రచన ద్రాక్షా కదళీపాకంలా ఉంటుంది.
ఘనం, ఘనమూలం కనుగొనడంలో పావులూరి మల్లన అనుసరించిన ఒక పద్ధతి ఆధునిక గణితాన్ని సైతం అబ్బురపరుస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంకెలు చివరనున్న సంఖ్యల ఘనమూలం కనుగొనాలంటే, ముందుగా 1, 4, 5, 6, 9 అంకెలను ఒక విభాగంగానూ 2, 3, 7, 8 అంకెలను ఒక విభాగంగానూ రాసుకోవాలి. 1, 4, 5, 6, 9 అంకెలు చివరన ఉన్న సంఖ్య ఎంత పెద్దదైనా ఆ సంఖ్యల ఘనమూలం చివర అదే అంకె ఉంటుంది.
ఇక 2 చివరన ఉన్న సంఖ్య ఘన మూలం చివరి అంకె 8, 3 చివరన ఉన్న సంఖ్య ఘన మూలం చివరి సంఖ్య 7 ఉంటుంది. అలాగే 8 చివరన ఉన్న ఘనమూలం చివరి అంకె 2, 7 చివరన ఉన్న ఘనమూలం చివరి అంకె 3 ఉంటుంది. ఈ నియమం గుర్తు పెట్టుకొని 1 నుంచి 9 అంకెల ఘనాలు గుర్తుపెట్టుకుంటే చాలు ఎంత పెద్ద ఘన మూలాలనైనా సులభంగా సాధించవచ్చు.
13824 అనే సంఖ్య ఘనమూలం ఎంత అంటే ముందుగా 13824ను మూడు మూడు అంకెలుగా విడగొట్టుకోవాలి. అంటే 13… 824 అని విడగొట్టుకోవాలి. ఇందు 824లో చివరి అంకె 4. కాబట్టి 13824 సంఖ్య ఘనమూలంలో చివరి అంకె 4 అని గ్రహించాలి. ఆపై 13 అనే సంఖ్య 2 ఘనానికి ఎక్కువగా 3 ఘనానికి తక్కువగా ఉన్నది. సమాధానంగా తక్కువ అంకెనే తీసుకోవాలి. ఇక్కడ తక్కువ అంకె 2ను పదుల స్థానంలో ఉంచితే సమాధానం 24 వస్తుంది. 24X24X24= 13824. ఘన మూల సంఖ్య వందల స్థానంలో ఉంటే ఇలాంటి చిన్న చిన్న సాధనలను మరికొన్నింటిని కలపవలసి ఉంటుంది.
మహా భారతంను మొట్టమొదటగా ఆంధ్రీకరించిన నన్నయ పద్యాలకంటే పావులూరి మల్లన లెక్కల పద్యాలే సులభంగా అర్థమవుతాయి. అయినప్పటికీ పావులూరి మల్లనకు రావలసినంత పేరు రాలేదు. పావులూరి మల్లన గణిత సమస్యలను నేటి 6వ తరగతి గణిత పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టవచ్చును కూడా. వీటి వల్ల విద్యార్థులకు గణన సామర్థ్యం పెరగటమే గాక గణన వేగం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా తక్కువ సమయంలో ఎక్కువ గణితం నేర్చుకునే సామర్థ్యం పిల్లలకు అలవడుతుంది. ఇలా మన తెలుగు పద్యాలలో గణితాన్ని అభ్యసించడం వల్ల విద్యార్థులకు ఏకకాలంలో తెలుగు భాష మీద పట్టు, గణితం మీద పట్టు రావడమే గాక విజ్ఞానాత్మక తెలుగు పారిభాషిక పద సృష్టి చేసుకునే సామర్థ్యం విద్యార్థులకు అలవడుతుంది.
కందం॥ రెండును యారుయు రెండును
దండిగ ముదమున ఒకటియు ధరణిని వెలగన్
మెండుగ నాలుగు నాలుగు
నిండుగ నిలువగ తెలుపు గణిత ఘన ఘనమున్
ఈ పద్యంలో చెప్పిన అంకెలను పక్కపక్కన రాసుకుంటే 262144 అనే సంఖ్య వస్తుంది. సంఖ్యను చూస్తూనే దీని ఘనం చెప్పాలంటే 262..144 అని సంఖ్యను చూడాలి. మొదట 144లో చివరి అంకె 4 కాబట్టి దీని ఘన విలువ చివరి అంకె 4 ఉంటుంది. ఇక 262 అనేది, 6 క్యూబ్కు 7 క్యూబ్కు నడుమన ఉంటుంది. కావున చిన్న అంకె 6ను పదుల స్థానంలో ఉంచితే 262144 ఘనమూలం 64 వస్తుంది. 64X64X64=262144యే అవుతుంది కదా?
తెలుగు భాషలో ఈ పావులూరి గణితమే గాక ప్రతాపరుద్రుని కాలంలో సూత్ర గణితము, అచ్యుత దేవరాయ కాలమున వల్లభామాత్య కవిచే తెనిగించబడిన లీలావతి గణితం, వేంకటేశ గణితం, ఎలుగంటి పెద్దనచే రచింపబడిన ప్రకీర్ణ గణితము వంటి గణితాలున్నాయి. అంతేకాక ఆరేడు దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రాంతమున తులసీ గణితం బాగా ప్రచారంలో ఉండేదని కొందరు పెద్దలు చెప్తారు. ఈ గణిత గ్రంథాలన్నీ ఆధునిక గణితము త్రోసిరాజనే స్థితిలోనే ఉన్నాయి. కానీ, ఈతరం విద్యార్థులకు ఇవి పాఠ్యాంశాలు కాకపోవడం విచారించవలసిన విషయం. నేటి విద్యార్థులు మన గణిత గ్రంథాలను పాఠ్యాంశాలుగా అభ్యసిస్తే ఏకకాలంలో అనేక అంశాలను అభ్యసించినవారవుతారు. అలాగే చేమకూర వెంకటకవి రాసిన విజయ విలాసం అనే ప్రబంధంలో…
‘తాసైరింపక యపర్ణ యుండగ భవద్గర్భంబున్ దాల్చితే
జోసహ్యున్ శరజన్ముగాంచి యల నీహార క్షమాభృత్ కుమా
రీ సాపత్న్యము గన్న మోహపు పురంద్రీ రత్నమౌనీవ కా
వే సర్వజ్ఞుడు నిన్నునేల తలపై నెక్కించుకో జాహ్నవీ!’
..వంటి పద్యాలలో శ్లేషాలంకారం ఉంది. కవి పద ప్రయోగం ఔచిత్య వంతంగా ఉంది. పద్యం చక్కెర మడి లో అమృతంలా ఉంది. (ఈ పద్యం చక్కెర మడిలో అమృతంలా ఉందని ఎవరన్నా అంటే, పద్యాన్ని పదే పదే పాడి షుగర్ తెచ్చుకోకు అని చమత్కారాలను విసిరేవారు కొందరుంటారు. తస్మాత్ జాగ్రత్త) అంటూ తమ తమ అభిప్రాయాలను తెలియజేసిన పండితులు చాలామంది ఉన్నారు. కానీ, పర్ణములు (ఆకులు) కూడా భుజించకుం డా తపము చేసిన అపర్ణ అని పిలువబడే పార్వతీ మాత తనకు వచ్చిన గర్భాన్ని భరించలేకుండా ఉంటే, ఆ గర్భా న్ని గంగమ్మ స్వీకరించిన విధానంలో ఆధునిక విజ్ఞానంలోని సరోగసి ఛాయలున్నాయని ప్రయోగశాల ముఖం చూచిన పండితులు ఎంతమంది ఉన్నారు? ఈ పద్యం లో కవి కుమారస్వామిని శరజన్ముడు అని సంబోధించాడు. శరము అంటే నీరు, రెల్లు అనే అర్థాలున్నాయి. పాతకాలపు జీవశాస్త్ర విజ్ఞానంలో నీటికి రెల్లుకు చాలా ప్రాధాన్యం ఉన్నది. కాకుంటే ఆ వైద్యం నేడు చాలా మొరటు అనిపిస్తుంది. ఆ మొరటును పక్కనపెట్టి అక్కడి జ్ఞాన ప్రక్రియ గురించి ఆలోచిస్తే ఆధునిక జీవశాస్త్రం మరింత వేగవంతం చేసే అవకాశం కొంత మేర వస్తుంది.
నేటి తరం విద్యార్థుల కన్నా ఇలాంటి విషయాలున్న పద్యాలను అర్థవంతంగా, సశాస్త్రీయంగా కొంతలో కొంత బోధించగలిగితే తెలుగు సాహిత్యం ప్రయోగశాలకు వెళ్లగలుగుతుంది. తెలుగంటే చిన్నచూపు వలదోయ్.. అనే స్థాయికి విద్యార్థులు వస్తారు. లేకుంటే తెలుగు సాహిత్యంలో అది ఉంది, ఇది ఉంది, అంతా ఉంది, ఎంతో ఉంది. ఆహా ఓహో అని అనుకోవడం తప్పించి మరేమీ ఉండదు.
-వాగుమూడి లక్ష్మీరాఘవరావు
62814 90160