ప్రస్తుతం స్త్రీవాదం (ఫెమినిజం) అంతరిస్తున్నది. దాని స్థానాన్ని అలింగవాదం (Wokeism) ఆక్రమిస్తున్నది. స్త్రీ, పురుష, తృతీయ (నపుంసక) లింగాలనేవి శాస్త్రీయమైన విభజన కాదనీ, అవి మన మానసిక స్థితిని బట్టి మారే వ్యక్తిగత మానసిక కల్పనలనే వితండవాదమే అలింగవాదం. మరోవైపు వర్గ పోరాటాల కమ్యూనిజం భావజాలం అంతరించి దాని స్థానంలో గుర్తింపు రాజకీయాలు (Identity Politics) ముందుకువచ్చాయి.
ఈ మార్పు ముందుగా పాశ్చాత్య దేశాల్లో మొదలై, వారిని అనుసరించే అనుంగు అనుచరుల ద్వారా మన దేశంలోకి పాకాయి. ఈ సామాజిక పరిణామానికి అనుగుణంగానే స్త్రీ వాదమో, అలింగవాదమో (స్వలింగ సంపర్కుల, తృతీయ లింగ, భిన్న శృంగార అభిరుచి గల బృందాల గుర్తింపు వాదం LGBTQ+), దళితవాదమో, ముస్లిం వాదమో చెప్పే రచనలు మాత్రమే ప్రచలితమౌతున్నాయి. ఒకదానికొకటి పొసగని, పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలతో కూడిన అసంబద్ధ, అపవిత్ర కలయికే ఈ గుంపు. ఎందుకంటే ముస్లిం వాదానికీ, అలింగవాదానికి చుక్కెదురు. స్త్రీ వాదానికి, అలింగవాదానికి పడదు. దళిత వాదం కులవివక్షకు వ్యతిరేకమైతే, ముస్లిం వాదం ముస్లిం మత గుర్తింపును నొక్కిచెప్తూ లౌకికవాదాన్ని విస్మరించేది. ఒక మతం గుర్తింపును అంగీకరిస్తే మరో మతస్థులు తమ మతం గుర్తింపును అంతే బలంగా వినిపిస్తారు. తమది ప్రత్యేకమైన జాతి అనే మత గుర్తింపు రాజకీయాల వల్లే పాకిస్థాన్ ఏర్పడిన వాస్తవాన్ని మరువరాదు.
అయితే, ట్రెండుకు అనుగుణంగా రాసే ప్రొఫెషనలిజం గానీ, అలవాటుగానీ లేని రచయిత్రి పి.జ్యోతి. విస్తారమైన దృష్టితో, ఓ వాదం అనే చట్రంలో ఇరికించకుండా స్త్రీల కథలను, స్త్రీల జీవితాలను సాహిత్యంలో చర్చకు పెట్టాలనే ఉద్దేశ్యంతో ‘ఉలిపి కట్టెలు’ కథల పుస్తకం రాశారు. ఆ ప్రయత్నంలో సంపూర్ణంగా సఫలీకృతులయ్యారు. తాను రచయితగా మారడానికి ప్రేరణ వివరిస్తూ నిజానికి, రాస్తున్నప్పుడు మాత్రమే నేను నేనుగా ఉండగలిగానని నిజాయితీగా సమాధానం చెప్పారు రచయిత్రి పుస్తకానికి రాసిన ముందుమాటలో. ఎన్నెల పిట్ట వారు ప్రచురించిన ఈ పుస్తకంలో పదిహేను జీవితాలనూ, వాటి సంఘర్షణలనూ, పరిస్థితులను నిష్పక్షపాతంగా వివరించారు.
వరుసగా ముగ్గురు ఆడపిల్లలని కన్నందుకు భర్తా, అత్త ఇంటి నుంచి వెలివేసి అక్రమ సంబంధం అంటగడితే, ధైర్యంగా ఒంటరిగా కూతుళ్లను తమ కాళ్ల మీద నిలబడేలా చేసిన కథను ‘ప్రశ్నార్థం’లో చెప్తే, తనకు పుట్టబోయే బిడ్డకు మంచి భవిష్యత్తు ఉండేందుకు అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు మరో బిడ్డను అపహరించి చంపే తల్లి గురించి ‘ఇదీ తల్లి ప్రేమే’ కథలో తెలియజేశారు. ఒక పురుషుడు తన తమ్ముడు చనిపోతే, అతని భార్యతో బలవంతపు శారీరక సంబంధం కొనసాగిస్తే, అతని తల్లిదండ్రులతో పాటు గా, అతని భార్య కూడా అతనికి వత్తాసుగా కుట్ర పన్నే అంశాన్ని ‘కథలో కథ’ అనే దానిలో చెప్పారు. అక్రమ సంబంధం కోసం కన్న కొడుకునే నిరాదరణ చేసిన విషయాన్నీ ‘ఆమె స్థానంలో’ అనే కథలో వివరిస్తే, స్వేచ్ఛా శృంగారం, స్త్రీ పురుషుల సహజీవనం, భార్యల మార్పిడి సంబంధాలను ఆధునికత పేరుతో ప్రచారం చేసేవారు, తమ భావాలను అంగీకరించని స్త్రీలపై ఎలా స్వేచ్ఛ పేరుతో బలవంతంగా రుద్దుతారో ‘అన న్య’ కథ చెప్తుంది. స్త్రీ, పురుషుల లైంగిక సంబంధాలు, వాటి పట్ల కుటుంబసభ్యుల ప్రవర్తనల గురించి నిష్పాక్షికంగా చెప్తూ నేను మునుప టి స్త్రీవాదిని కాదంటారు రచయిత్రి.
ఆధునిక జీవితంలోని వైరుధ్యాలను రచయిత్రి ఈ కథల్లో విడమర్చి చెప్పారు. తల్లి సంపాదించి ఇచ్చిన ఆస్తితో పాటు, సొంత సంపాదనతో సంపన్నులైన కూతుళ్లు, ఆ తల్లి చనిపోతే ఆమె చేతి బంగారు గాజుల పంపకం కోసం శవం దగ్గరే గొడవపడే వైనాన్ని ‘అందమైన జీవితం’లో చిత్రీకరించారు. సంచార జీవన విధానం వల్ల కూలీ కోసం తలో దిక్కుకు చెల్లాచెదురయ్యే కుటుంబ జీవితంతో విసిగిన ఒక బంజారా యువకుడు ఒక పట్టణంలో స్థిరపడి, కష్టపడి తన కొడుకును చదివించి ప్రయోజకుడిని చేస్తే, అతను ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడతాడు. అతని సంతానం కూడా విద్యావంతులై అవకాశాలు అందిపుచ్చుకొని వేరే, వేరే దేశాల్లో స్థిరపడగా, చివరికి అతను ఒంటరిగా చనిపోయే ఆధునిక సంచార నాగరికత వ్యథాభరిత జీవితాన్ని ‘తాలు గింజలు’లో హృద్యంగా చిత్రీకరించారు. ఆల్విన్ టాఫ్లర్ 1970లోనే రచించిన భవిష్యత్ అఘాతం పుస్తకంలో అత్యాధునిక పారిశ్రామికీకరణ వల్ల భవిష్యత్తులో మనిషి తన పుట్టిన ప్రాంతానికి పరిమితమయ్యే మానసిక అనుబంధాన్ని వదిలించుకొని ఉన్నతావకాశాలను వెతుకుతూ ఎక్కడికైనా వెళతాడనీ, తనకు అనువైనచోటే తన నివాసం అని సర్దుకుంటాడని చెప్పాడు.
ఆకట్టుకొనే కథనంతో పాటుగా సాఫీ గా, పాత్రోచితంగా సాగే సంభాషణలు కథలకు జీవం పోశాయి. ఇజాల జోలికి వెళ్లకుండా జీవిత వైవిధ్యాలను నిజాయితీగా వెల్లడించేవే ఈ ‘ఉలిపి కట్టెలు’.
-ఆనందేశి నాగరాజు
9848838323