Theft Case | పాల్వంచ, ఫిబ్రవరి 22 : పాల్వంచ పట్టణంలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో డీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్‌లో (హోల్ సేల్ షాప్‌లో) జరిగిన రూ.26 లక్షల ఖరీదు చేసే సిగరెట్ బండిల్స్ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అశోక్, మనీష్, గణపతి అనే ముగ్గురు నిందితులను పాల్వంచ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
చోరీ కేసుకు సంబంధించి పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. పాల్వంచలోని డీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 2025 జనవరి 3వ తేదీన రూ. 26 లక్షల ఖరీదు చేసే సిగిరెట్ బండిల్స్ చోరీకి గురయ్యాయి. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పాల్వంచ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రధాన నిందితుడు అశోక్ అనే వ్యక్తి గతంలో పాల్వంచలోని ఒక కిరాణా షాప్ లో పనిచేశాడు. ఈ ప్రాంతం గురించి అంతా తెలిసిన అతను ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రాజస్థాన్ రాష్ట్రంలోని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఈ చోరీకి ప్లాన్ వేశాడు. జనవరి 3వ తేదీన పాల్వంచకు ఒక వాహనంలో వచ్చి డీఎంఆర్ ఎంటర్ప్రైజెస్ షాపు షట్టర్‌ను పగలగొట్టి అందులో ఉన్న సిగరెట్ బండిల్స్‌ను చోరీ చేశారు.
అనంతరం వాటిని హైదరాబాద్‌లోని బోయినపల్లిలో ఉండే రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన గణపతి అనే వ్యాపారికి అమ్మారు. పాల్వంచ పోలీసులు దర్యాప్తు చేపట్టి రాజస్థాన్ కు చెందిన నిందితులు అశోక్, మనీష్ అలాగే హైదరాబాద్ కు చెందిన వ్యాపారి గణపతిని పట్టుకున్నారు.. చోరీకి పాల్పడిన నిందితులు సిగరెట్ బండిల్స్ అమ్మగా వచ్చిన రూ.5 లక్షలతోపాటు రెండు ఐఫోన్లు మరో సాధారణ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.
చోరీ చేసిన సిగరెట్ బండిల్స్ అన్నింటిని నిందితులు అమ్మి వేయడం జరిగింది. అందులో ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ ఫోన్ లతో పాటు మిగిలిన సొమ్ములను కూడా రికవరీ చేస్తామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో సునీల్, గణేష్ అనే నిందితులు పరారీలో ఉన్నట్లు వారిని కూడా త్వరలో పట్టుకొని అరెస్టు చేస్తామని డీఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. విలేకరుల సమావేశంలో పాల్వంచ సీఐ సతీష్, ఎస్సై రాఘవయ్యలు పాల్గొన్నారు.
Maha Kumbh | 41 రోజులు.. 60 కోట్ల మంది పుణ్యస్నానాలు.. చివరి దశకు మహాకుంభమేళా
Crime news | బస్ కండక్టర్‌పై అమానుషం.. మరాఠీ మాట్లడలేదని మూకుమ్మడి దాడి