Mirchi | గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న మిర్చి రైతులను ఆదుకునేందుకు వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా క్వింటాలు రూ.25 వేలకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రం డిమాండ్ చేశారు.
రఘునాథపాలెం మండల పరిధిలోని చింతగుర్తి గ్రామంలోని మిర్చి పంట కల్లాలను సీపీఐ(ఎం) నాయకులు ఇవాళ ఉదయం సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు సీపీఐ(ఎం) నాయకులతో మాట్లాడుతూ.. తమకు గిట్టుబాటు ధరలు రావడం లేదని.. గత ఏడాది కన్నా ఈ ఏడాది ధరలు సగానికి సగం పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఏడాది గరిష్టంగా క్వింటాలుకు రూ.20 వేలు లభించగా.. ఈ ఏడాది గరిష్టంగా రూ.13,500 మాత్రమే వస్తుందన్నారు. ఎకరాకు రూ.2 లక్షలకుపైగా పెట్టుబడి పెట్టామని తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గాయని క్వింటాలు ధర రూ. 25 వేలకు తగ్గితే తమకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు.
ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే నాఫెడ్, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. రైతులు ధైర్యం వుండాలని అందరం కలసి పోరాటం చేద్దామని రైతులకు తెలియజేశారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 3న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి రైతులంతా పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రఘునాధపాలెం మండల కార్యదర్శి ఎస్ నవీన్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎంఏ జబ్బార్ దొంగల తిరుపతిరావు షేక్ మీరా సాహెబ్, రఘునాధపాలెం మండల కమిటీ సభ్యులు పటాన్ రహీం ఖాన్,నల్లమోతు నాగయ్య, కనగంటి తిరపయ్య, గుగులోత్ కుమార్, బానోత్ నాగేశ్వరరావు, కూచిపూడి నరేష్, షేక్ అబ్దుల్, హరి నాయక్, చింతగుర్తి గ్రామ సర్పంచ్ మెంటెం రామారావు, మాజీ సొసైటీ సభ్యులు తాతా వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.