Corn Crop | బోనకల్లు : రైతులు సాగు చేస్తున్న పంటలకు సాగర జలాలను నిరంతరాయంగా సరఫరా చేసి పంటను కాపాడాలని ప్రభుత్వాన్ని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, జిల్లా కమిటీ సభ్యులు దొండపాటి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గం మొత్తం సాగర్ జలాలపై ఆధారంగానే పంటలు సాగవుతున్నాయి అన్నారు.
ప్రధానంగా యాసంగి సాగులో జిల్లాలోని అత్యధికంగా బోనకల్లు మండలంలో మొక్కజొన్న పంటను సాగు చేశారన్నారు. దీంతోపాటు మధిర నియోజకవర్గవ్యాప్తంగా మొక్కజొన్న పంటను అన్నదాతలు పెద్ద మొత్తంలో సాగు చేశారన్నారు. ప్రస్తుతం అనేక గ్రామాలలో మొక్కజొన్న కంకి వేసే దశలో ఉందన్నారు. కంకి వేసే దశలో సాగునీరు సక్రమంగా అందకపోతే పంట దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. దీనివలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామాలలో సాగుచేసిన మొక్కజొన్న పంట సాగర్ నీరు అందక ఎండిపోతుందని, ప్రధానంగా ఆళ్లపాడు, నారాయణపురం, పోలంపల్లి, డబ్బాకుపల్లి, తూటికుంట్ల తదితర మైనర్ల కింద పెద్ద ఎత్తున మొక్కజొన్న పంట ఎండిపోతుందన్నారు.
అదేవిధంగా ఖమ్మం మార్కెట్కు పెద్ద ఎత్తున మిర్చి వస్తుందని, కానీ వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై మిర్చిని కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తున్నారని, దీనివల్ల రైతులకు నష్టం జరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రతీ ప్రభుత్వం తమది రైతుల ప్రభుత్వం అంటూ రైతులనే మోసం చేస్తున్నారని వారు ఘాటుగా విమర్శించారు.
రైతులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే బోనకల్ బ్రాంచ్ కెనాల్ కు నీటిపారుదల శాఖ అధికారులు సాగర్ నీటిని నిలిపివేస్తున్నారని, దీనివల్ల సాగర్ నీటి విషయంపై రైతుల్లో భయాందోళన నెలకొని ఉందన్నారు. ఈ సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి కిలారు సురేష్ నాయకులు, ఏసు పోగుబాబు తదితరులు పాల్గొన్నారు.
Mancherial | కోనూర్లో విషాదం.. పంట చేను కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ వైరుకు రైతు బలి
Maha Kumbh | మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 43 కోట్ల మంది పుణ్యస్నానాలు