కాసిపేట, ఫిబ్రవరి 11: మంచిర్యాల జిల్లా (Mancherial) కాసిపేట మండలంలో విషాదం చోటుచేసుకుంది. పంట చేను రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి ఓ రైతు మృతిచెందారు. కాసిపేట మంటంలోని కోనూర్లో అంకతి మల్లయ్య అనే వ్యక్తి కరెంటు షాక్తో చనిపోయారు. గ్రామంలోని ఓ పెరడులో తోట పంటల చుట్టూ కరెంటు తీగలు పెట్టారు. కాగా, మంగళవారం ఉదయం మల్లయ్యకు చెందిన బర్రె ఆ తోట వైపు వెళ్లి కంరెటు షాక్కు గురైంది. అయితే బర్రె కనిపించడం లేదంటూ.. వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన ఆయనకు విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మరణించారు.
బర్రె కోసం వెళ్లి రైతు మరణించడంతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పంట చేన్లకు విద్యుత్ తీగలు పెట్టొద్దని అధికారులు సూచిస్తున్నా.. రైతులు పట్టించుకోకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.