కొందరికి వ్యక్తిగత ఆసక్తులు తక్కువగా ఉంటాయి. వాళ్ల ఆలోచనలన్నీ సమాజం చుట్టూనే తిరుగుతుంటాయి. ఇదే కోవకు చెందుతాడు ఈ యువకుడు. సామాజిక సేవే లక్ష్యంగా బతుకు వెళ్లదీస్తున్న అతని దృష్టి పర్యావరణంపై పడింది. బక్కచిక్కిపోతున్న వనాలను చూసి కలత చెందాడు. పర్యావరణానికి ఊపిరిలూదాలని రంగంలోకి దిగాడు. తనవంతు ప్రయత్నంగా జపాన్‌కు చెందిన మియావాకి అడవులను సృష్టిస్తున్నాడు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలనే లక్ష్యంతో పాటుపడుతున్న తలారి మహేశ్ బతుకమ్మతో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే..
మాది యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఎం.తుర్కపల్లి గ్రామం. అమ్మానాన్నలిద్దరూ మాకున్న కొద్దిపాటి పొలంలోనే తిండిగింజలు పండించుకుంటూ కూలి పనులకు వెళ్లేవాళ్లు. ఎంఎస్సీ వరకు చదువుకున్న నేను పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలని హైదరాబాద్‌కి వచ్చాను. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాణ్ని. నిరాశ్రయులకు ఆహారం అందించడం, మారథాన్ ఈవెంట్ల నిర్వహణలో పాలుపంచుకునేవాణ్ని. 2017లో గ్రూప్స్ రాసినా ఎంపిక కాలేకపోయాను. అయినా సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మానలేదు. రోజురోజుకీ మరింత ఆసక్తి పెరిగింది.
ఉద్యోగ ప్రయత్నాలకూ స్వస్తి పలికి సమాజ సేవకే సమయం అంతా కేటాయించాను. 2017లో కేరళ, చెన్నైలలో వరదలొచ్చినప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అక్కడికి వెళ్లి నావంతు సాయం అందించాను. కరోనా సమయంలో వనస్థలీపురంలో నా స్నేహితుడు ఓ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాడు. నేనూ అక్కడికి వెళ్లాను. అక్కడే నాకు తలసేమియా బాధితుల గురించి తెలిసింది. వారి కోసం నావంతుగా ఏదైనా చేయాలని.. పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి బ్లడ్ క్యాంప్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు దాదాపు 200 సార్లు బ్లడ్‌క్యాంప్‌లు నిర్వహించాను. నేను కూడా 12 సార్లు రక్తదానం చేశాను.

గ్రామీణ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నప్పటినుంచే పర్యావరణం అంటే ఇష్టం. వర్షాకాలంలో రకరకాల మొక్కలు తెచ్చి ఇంటి ఆవరణలో నాటుతుండేవాణ్ని. నేను నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతుంటే ఏదో తెలియని ఆనందం కలిగేది. మా ఊరి వాతావరణం నన్ను మొక్కల వైపు మళ్లించింది. ఒకరోజు జపాన్‌కు చెందిన మియావాకి ఫారెస్ట్ గురించి ఓ ఆర్టికల్ వస్తే చదివాను. చాలా ఆసక్తిగా అనిపించింది. అడవులు అంతరించిపోతున్న ప్రస్తుత రోజుల్లో మియావాకి వనాలను పెంచితే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు కదా! అనిపించింది.
ఆ లక్ష్యంతోనే 2020లో ‘ఎవర్ గ్రీన్ అగైన్’ పేరుతో అడవుల పెంపకానికి శ్రీకారం చుట్టాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచడమే మియావాకి కాన్సెప్ట్. దీనిపై బెంగళూరులో ట్రైనింగ్ కూడా తీసుకున్నా. నా ఆలోచన అమలు చేయాలంటే ఆర్థిక వనరులు కూడా అవసరమే! ఇందుకోసం పలు సంస్థల సహకారం తీసుకుంటున్నా. అవి అందించే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) ఫండ్స్‌తో ఇలా మియావాకి అడవులను సృష్టిస్తున్నా!

హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో పచ్చదనం తగ్గిపోతున్నది. కాంక్రీట్ జంగల్‌ను తలపించే ఈ ప్రాంతంలో రేపటి రోజుల్లో కాలుష్యం రాజ్యమేలుతుందని నా భయం. అందుకే గ్రేటర్‌ను ఆనుకొని ఉన్న రాజేంద్రనగర్, బీహెచ్ఈఎల్, మేడిపల్లి, చర్లపల్లి, శంషాబాద్ లాంటి కమర్షియల్ ప్రాంతాల్లో నా మొదటి ప్రాజెక్టు చేపట్టాను. ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలు, అటవీ ప్రాంతం, ఇతర సంస్థల స్థలాల్లో వివిధ అనుమతులు తీసుకొని మియావాకి కోసం మొక్కలు నాటాను. ఇప్పటివరకు సుమారు లక్షకు పైగా మొక్కలను నాటాను. కేవలం మొక్కలు నాటి వదిలేయకుండా.. మూడేండ్ల పాటు వాటికి నీరందిస్తూ, సంరక్షిస్తున్నాను. ఆ తరువాత వాటంతటవే ఏపుగా పెరిగి అడవులను తలపిస్తాయి. మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి.
నేను నాటే మొక్కల్లో గతంలో ఆ ప్రాంతాల్లో పెరిగిన వాటినే ఎంచుకుంటున్నా. వాటిలో ప్రధానంగా ఆయుర్వేదానికి సంబంధించినవి, రకరకాల పండ్ల మొక్కలు, మన ఊరి గుట్టల్లో పెరిగే ఇతర చెట్ల మొక్కలను నర్సరీల నుంచి కొనుగోలు చేసుకొచ్చి నాటుతున్నాను. భవిష్యత్తులో నేనే ఒక నర్సరీని ఏర్పాటు చేసుకొని కావాల్సిన మొక్కలను పెంచాలనే ఆలోచనలో ఉన్నాను. రేపటి తరాలకు మంచి గాలిని, పచ్చని అడవులను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా. దేశవ్యాప్తంగా మియావాకి విస్తరించేందుకు కృషి చేస్తున్నా.
– రాజు పిల్లనగోయిన