నిర్మాతల పాలిటి లక్కీఛార్మ్గా మారింది తెలుగమ్మాయి శివానీ నాగరం. ఇప్పటి వరకూ తను చేసిన సినిమాలన్నీ నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టినవే కావడం విశేషం. రీసెంట్గా విడుదలైన ‘హే బలవంత్’ సైతం బ్రేక్ ఈవెన్ అయిందని ఇటీవల నిర్మాతలే ప్రకటించారు. దీంతో ప్రస్తుతం శివాని డేట్స్ కోసం చాలామంది నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు వినికిడి. శివానీ మంచి నటి మాత్రమే కాదు.
శాస్త్రీయనృత్య కళాకారిణి కూడా. తను పాటలు కూడా బాగా పాడుతుంది. ఈ విషయాన్ని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ‘నాకు శాస్త్రీయ సంగీతం వచ్చు. శాస్త్రీయ నృత్యంలోనూ ప్రవేశం ఉంది. సినిమాల్లోకి రాకముందు డ్యాన్స్ టీచర్‌గా పని చేశాను.
ప్రస్తుతం ఇతర భాషల్లోనూ అవకాశాలొస్తున్నాయి. అన్నీ మంచి కథలే. అయితే.. నా లోని ప్రతిభను ప్రదర్శించే పాత్రలైతే ఇప్పటివరకూ రాలేదు. అలాంటి పాత్ర వస్తే ఒక నృత్యకారిణిగా నేనేంటో నిరూపించుకోవాలనుంది. అలాగే సొంతంగా పాడుకోవాలని కూడా ఉంది. భవిష్యత్‌లో నా ఆశలు ఫలిస్తాయని నమ్మకంతో ఉన్నా’ అంటున్నది తెలంగాణ అమ్మాయి శివానీ నాగరం.