CPI (M) | కారేపల్లి, సెప్టెంబర్ 28 : ఏజెన్సీ ప్రాంతాలలో సమస్యలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టటం లేదని సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు, మండల కార్యదర్శి కే. నరేంద్ర లు విమర్శించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండలం మాణిక్యారం ఉమ్మడి గ్రామపంచాయతీలో సమస్యలపై ఆదివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. మాణిక్యారం,చింతలపాడు, మొట్లగూడెం, కొత్తగుంపు గ్రామాల్లో పర్యటించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రహదారి, రైల్వే అండర్ బ్రిడ్జిలో నిల్వ నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు పాదయాత్ర బృందానికి తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎం) నాయకులు మాట్లాడుతూ.. మాణిక్యారం మొట్లగూడెం గ్రామాల మధ్య ఆరు కిలోమీటర్ల రహదారి అసంపూర్తిగా మిగిలి అవస్థల పాలు చేస్తుందన్నారు. ఈ రహదారికి ఫారెస్టు అనుమతుల ఆటంకం, బిల్లులు చెల్లింపుల జాప్యం వంటి కారణాలతో నిలిచిపోతూ వస్తుందన్నారు. 15 ఏండ్లుగా ఈ రహదారి పనులు సాగటం లేదన్నారు. ప్రస్తుతం కంకర వేసి బీటీ ఆగిపోయిందన్నారు. రైల్వే శాఖ కారేపల్లి-చీమలపాడు రైల్వే ట్రాక్ చింతలపాడు వద్ద ఉన్న రైల్వే గేటును తొలగించి అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేసిందన్నారు. ఈ బ్రిడ్జితో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలకు మరింత బాధలు తప్పడం లేదన్నారు.
వర్షాకాలంలో నిరంతరంగా అండర్ రైల్వే బ్రిడ్జిలో నీరు నిల్వ ఉండి రాకపోకలు సాగటం లేదన్నారు. ప్రయాణికులతోపాటు చేను పనులకు వెళ్లటానికి రైతులు నడుములోతు నీటిలో నుండి వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. గతంలో అండర్ బ్రిడ్జి నీటిలో పడి బాలుడు మృతి ఘటన ఉందన్నారు. బ్రిడ్జిలో నీరు నిల్వ లేకుండా రైల్వే శాఖ చూడాలన్నారు. ఊట్కూర్- ఎర్రబోడుగాదెపాడు ఆర్టీసీ బస్ నిలిపివేశారని దానిని పునరుద్దించాలని డిమాండ్ చేశారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఏజెన్సీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించి పరిష్కారం చూపాలన్నారు. పరిష్కారం కాకుంటే బాధిత గ్రామాల ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వైరా డివిజన్ కమిటీ సభ్యులు వజ్జా రామారావు, డీవైఎఫ్ ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆదెర్ల వినయ్ కుమార్, దారావత్ వినోద్, సీపీఐ (ఎం) మండల నాయకులు కే.ఉమావతి, కరపటి సీతారాములు, పోతర్ల నాగేశ్వరరావు, భూక్యా ఈర్యా, గుగులోత్ బాబురావు, వాంకుడోత్ సతీష్ దూడా రాములు, వాంకుడోత్ బాబురావు, భూక్యా నాగేశ్వరరావు, వల్లపు లింగయ్య, రమేష్, రాజమ్మ, వీరమ్మ, సునిత, సూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
MGBS | ప్రయాణికులకు శుభవార్త.. ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం